-

పట్టుకోండి చూద్దాం

10 Sep, 2015 04:33 IST|Sakshi
పట్టుకోండి చూద్దాం

- జిల్లాలో ట్యాక్స్ చెల్లించనివాహనాలు 27,001
- బకాయి వసూళ్లపై దృష్టి పెట్టని రవాణా శాఖ
- ‘సర్దుకుపోతున్న’అధికారులు  
- రావాల్సిన ఆదాయం రూ.80 లక్షలు
అనంతపురం టౌన్ :
ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రవాణా శాఖలో ట్యాక్స్ వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా వేల వాహనాలు ట్యాక్స్ చెల్లించకుండా రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి సుమారు రూ.80 లక్షల వరకు బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఎక్కడికక్కడ అధికారులు ‘సర్దుకుపోతుండడం’తోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అనంతపురం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లులో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి.

ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)లతో పాటు ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా ఉంది. అధికారులు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లెసైన్సుల మంజూరు, వాహనాల ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించి ప్రయాణికులు, లగేజి తీసుకెళ్లడంతో పాటు ప్రధానంగా ట్యాక్స్ చెల్లించని వాహనాలను గుర్తించి జరిమానా విధించాలి. ప్రతి నెలా ఎంవీఐలు, ఏఎంవీఐలకు టార్గెట్ కూడా ఉంటుంది.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి ట్యాక్స్ చెల్లించాల్సినవి 27,001 ఉన్నాయి. వీటిలో కొన్ని మూడు నెలలకు ఒకసారి, మరికొన్ని ఏడాదికి ఒకసారి ట్యాక్స్ చెల్లించే వాహనాలు ఉన్నాయి. అధికారుల పట్టింపులేని తనంతో వాహనదారులు మిన్నకుండిపోతున్నారు. ట్యాక్స్ వసూళ్ల విషయంలో కొందరు అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో చూసీచూడకుండా వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చిన్నచిన్న వాహనాల వరకు ట్యాక్స్ కట్టించుకుంటున్నా పెద్ద వాహనాలకు సంబంధించి పట్టుబడినా ‘సర్దుకుపోతున్నారన్న’ ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లించని వాటిలో పది శాతం వాహనాలు ప్రస్తుతం తిరగడం లేదని అధికారులు చెబుతున్నా మిగిలిన వాటి విషయంలో వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  
 
పట్టుబడితే భారీ జరిమానా వేస్తాం
ట్యాక్స్ చెల్లించని వారు తక్షణం చెల్లించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ను త్వరలో చేపడతాం. ఆ సమయంలో పట్టుబడితే భారీ జరిమానా విధిస్తాం. ట్యాక్స్‌ను కార్యాలయంలోనే కాకుండా మీ సేవలో కూడా చెల్లించే అవకాశం ఉంది. ఒక వేళ వాహనాలను తిప్పకపోతే రాతపూర్వకంగా తెలియజేయాలి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

మరిన్ని వార్తలు