అధికారంలోకి వస్తే

1 Feb, 2016 04:33 IST|Sakshi

 ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం

 నెహ్రూనగర్ :  రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తథ్యమని కమలాపురం ఎమ్మెల్యే, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ పార్టీ అధినేత జగన్‌మెహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 18వ తేదీ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఆయన గుంటూరు వచ్చారు.

ఈ సందర్భంగా అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గుంటూరు రీజియన్ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోల్‌సేల్‌గా ఆర్టీసీని సేల్ చేసేందుకు కాచుకొని ఉన్నట్లు ఆరోపించారు. యూనియన్లు బలహీనపడిన నేపథ్యంలో బాబు ఆర్టీసీ కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఆర్టీసీ ఇంత వరకు బతికి  ఉందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పుణ్యమేనన్నారు.

ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న జగన్ కూడా ఆర్టీసీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వచ్చిన గుర్తింపు ఎన్నికలను దానికి చక్కని వేదికగా మలచుకోవాలని రవీంద్రనాథ్‌రెడ్డి ఇటు పార్టీ నేతలకు, అటు కార్మికులకు పిలుపునిచ్చారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కార్మిక వ్యతిరేకని  వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఇకపై సహించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కార్మికులకు అండగా నిలిచి ఆర్టీసీని పరిరక్షిం చుకునేందుకు ఎన్నిక ల బరిలో దిగుతున్నట్లు వెల్లడిం చారు. జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ   అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవడం ఖాయమని స్పష్టం చేశారు. నర్సరావుపేట ఎమ్యెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదుకోవాల్సిందిపోయి పన్నుల పేరుతో వేధిస్తూ మరింత నష్టాల్లోకి నెడుతోందని నిందించారు.

మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఓ వైపు ఆర్టీసీ చార్జీలు పెంచకుండా మరోవైపు ఆర్టీసీకి నష్టాలు రాకుండా భారమంతా ప్రభుత్వంపైనే వేసుకొని  ప్రజోపయోగ రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దారని తెలిపారు.గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మ ద్ ముప్తఫా మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు. కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటరమణ, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, తెనాలి కన్వీనర్ అన్నాబత్తుని శివకమూర్, పెదకూరపాడు కన్వీనర్ పాణ్యం హానిమిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు