వాడుతున్న ‘పచ్చతోరణం’

31 Jan, 2014 06:33 IST|Sakshi

 నీరుగారుతున్న పథకం
 భూములను గుర్తించలేదు
 మొక్కలను నాటించలేదు
 నాటిన చోటా రక్షణ లేదు
 ప్రయోజనం పొందని ఎస్సీ, ఎస్టీలు
 సగం మండలాలలోనూ అమలు కాలేదు
 
 పథకం అమలు కాని మండలాలు..
 భిక్కనూర్, బీర్కూర్, బోధన్, ధర్పల్లి, గాంధారి, జక్రాన్‌పల్లి, కామారెడ్డి, కమ్మర్‌పల్లి, లింగంపేట్, మాచారెడ్డి, మద్నూర్, మాక్లూర్, మోర్తాడ్, నాగిరెడ్డిపేట్, నందిపేట్, సదాశివ్‌నగర్, వేల్పూర్, ఎల్లారెడ్డి.
 
 పథకం అమలైన మండలాలు..
 ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ, భీమ్‌గల్, బిచ్కుంద, డిచ్‌పల్లి, దోమకొండ, జుక్కల్, కోటగిరి, న వీపేట్, నిజాంసాగర్, నిజామాబాద్, రెంజల్, సిరికొండ, తాడ్వాయి, వర్ని, ఎడపల్లి.
 
 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలోని పేదలకు లబ్ధి చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ఒక అడుగు ముందుకు...రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ఆరంభంలో మొదలైన ఈ పథకం ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్నా నత్తనడక నడుస్తోంది.                 -మోర్తాడ్, న్యూస్‌లైన్
 
 మోర్తాడ్, న్యూస్‌లైన్:
 జిల్లాలో ఎక్కడ కూడా పచ్చతోరణం పథకం కింద ఎస్సీ, ఎస్టీలు పెద్దగా లబ్ధి పొందిన దాఖలాలు లేవు. జిల్లాలో 36 మండలాలు ఉంటే 17 మండలాలలోనే పథకం అమలవుతోంది. మరో 18 మండలాలలో పథకం జాడ లేకుండా పోయింది. పిట్లంలో రెగ్యులర్ ఏపీఓ లేకపోవడంతో ఈ మండలానికి సంబంధించి పచ్చతోరణం ప్ర తిపాదనలు అధికారులకు అందలేదు. ఇందిర క్రాంతి పథకం ద్వారా లబ్ధిదారుల కోసం సర్వే నిర్వహించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సర్వే జరిపి వివరాలను ఉపాధి హా మీ పథం అధికారులకు అందచేశారు. జిల్లాలో 790 మంది లబ్ధిదారులతో 1,39,530 మొక్కలు నాటించి వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
 
 ఉపాధిహామీ ద్వారా
 రెవెన్యూ భూములు, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల శిఖం భూములు, రోడ్లు భవనాల శాఖ పరిధిలోని రోడ్లకు ఇరువైపుల ఉన్న భూములు, ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములలో ఇందిరమ్మ పచ్చతోరణానికి సంబంధించిన మొక్కలను పెంచాల్సి ఉంది. ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పని చేసిన ఎస్సీ, ఎస్టీలకు మొక్క లను అప్పగించి, వాటిని సంరక్షించడానికి కొంత డబ్బును అందించాలి. అంతేకాక మొక్కలు పెరిగిన తరువాత వాటికి కాసిన పండ్లు, కాయలను విక్రయించుకుని లబ్ధి దారులు ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 53 మంది లబ్ధిదారులతో 8,746 మొక్కలను నాటించారు. నిర్ణీత లక్ష్యంలో కనీసం పది శాతం కూడా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించలేదు.
 
 ఎందుకిలా
 శిఖం భూములు, రెవెన్యూ భూములు కబ్జాదారుల చేతులలో ఉండటం, ఆర్‌అండ్‌బీ రహదారులను గుర్తించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ లకు ఇందిరమ్మ పచ్చతోరణం పథకం అందని ద్రాక్షలాగా మారింది. 17 మండలాలలో పథకం అమలైనట్లు ఉపాధి హమీ అధికారులు చెబుతున్నా లక్ష్యానికి చేరరువలో లేకుండాపోయింది. పథకం అమలు దశలోనే భూములను గుర్తించక పోవడంతో లబ్ధిదారుల ఎంపికతోనే సరిపెట్టాల్సి వచ్చింది.రానున్న ఆర్థిక సంవత్సరంలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం
 - కుమారస్వామి, ఏపీడీ డ్వామా
 రానున్న ఆర్థిక సంవత్సరంలో పచ్చతోరణం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం. ఈ సంవత్సరం భూములు గుర్తించక పోవడంతో సంపూర్ణంగా అమలు చేయలేదు. ఆర్‌అండ్‌బీ రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, పంచాయతీ రోడ్లను గుర్తించి మొక్కలు నాటిస్తాం. పూర్తి స్థాయిలో పథకాన్ని అమలు చేస్తాం.
 

మరిన్ని వార్తలు