అ(ఉ)పకారంపై కొనసాగుతున్న విచారణ

20 Apr, 2016 00:50 IST|Sakshi

 పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తే.. లేని పేర్లు సృష్టించి అధికారులు కాజేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న వీరిని హాస్టల్ విద్యార్థులుగా చూపించి లక్షల రూపాలు మింగేశారు. ఆలస్యంగానైనా ఇది కాస్త వెలుగులోకి రావడంతో అవినీతి నిరోధక శాఖాధికారులు నిజాలు వెలికి తీసేందుకు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా దీని సంగతి, వెనుకనున్న పెద్దల సంగతి తేల్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే తప్పులు చేసిన అధికారులు తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలను ఆశ్రరుుంచారని సమాచారం. మరి ఏసీబీ ఎంత వరకు నిజాలను వెలికితీసి అధికారుల భరతం పడుతుందో వేచి చూడాల్సిందే!
 
 శ్రీకాకుళం టౌన్/పాతబస్టాండ్ :  ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను హాస్టల్ విద్యార్థులుగా చూపిస్తూ ఏటా రూ.లక్షలు కాజేస్తున్న వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖాధికారులు రోజంతా విచారణ కొనసాగించారు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో ఓ బృందం విచారణలో రెండో రోజూ కలెక్టరేట్ చుట్టూ తిరిగింది. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహంను మంగళవారం నేరుగా కలసిన ఏసీబీ డీఎస్పీ రంగరాజు సుదీర్ఘంగా చర్చించారు. జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతరావు చాంబరులో ఇన్‌చార్జి బీసీ సంక్షేమ శాఖాధికారిగా ఉన్న ధనుంజరావును విచారించారు. ఆయన వద్ద రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. స్కాలర్‌షిప్పుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలరాజును ఉదయం 10నుంచి రాత్రివరకు ఏసీబీ కార్యాలయంలో ఉంచి విచారించారు.
 
 305 మంది విద్యార్థుల సొమ్ము మళ్లింపు...
 జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో బీసీ విద్యార్థులు  గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్నారని చూపిస్తూ ప్రభుత్వం నుంచి రూ.లక్షలాధిగా నిధులు దారి మళ్లించేశారు. అందులో గిరిజన సంక్షే మ అధికారులతో పాటు బీసీసంక్షేమ శాఖ ఉద్యోగులు భాగస్వాములు కావడంతో ఇటీవల సస్పెండైన గిరిజన సంక్షేమశాఖ అధికారి ఖాతాకు నిధులు మళ్లించారు. ఈ వ్యవహారంలో రెండు శాఖల అధికారులతో పాటు భ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలను వ్యక్తం చేసిన కలెక్టర్ లీడ్ బ్యాంకు మేనేజరు రామిరెడ్డిని పిలిపించి ఖాతాలను పరిశీలించాలని ఆదేశించారు.
 
  ఈ ఏడాది ఫిబ్రవరి 24న బిల్లులు ఆన్‌లైన్లో అందజేస్తే టీబీఆర్ నంబరు జనరేట్ అయ్యింది. దీంతో ట్రెజరీ నుంచి నేరుగా ప్రస్తుత ఎస్టీ హాస్టల్ వార్డెన్‌గా ఉన్న ఝూన్సీ ఖాతాలోకి 305మంది విద్యార్థులకు సంబంధించిన నిధులు జమయ్యాయి. ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.32.02 లక్షలు జమైంది. అంతకు ముందే గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అధికారి సస్పెండ్ కావడంతో ఆ నిధులు డ్రా చేసేందుకు అకౌంటు హోల్డర్‌గా ఉన్న ఝూన్సీ ముందుకు రాలేదు.
 
 అధికారికే రూ.5 లక్షలు ఇవ్వజూపారు...
  గత ఏడాది ఇదే వ్యవహారానికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖలో పర్యవేక్షణాధికారిగా ఉన్న అధికారికి రూ.లక్ష ముడుపుగా అందజేసి ఖాతాలో చేరిన రూ.లక్షలు కాజేశారు. ఈ ఏడాది ప్రభుత్వం ఫిబ్రవరిలో వార్డెన్ ఖాతాకు జమైన రూ.32.02 లక్షలు విత్‌డ్రా చేయడానికి ముందు సదరు అధికారికి రూ.5లక్షలు ముడుపుగా అందించేందుకు సిద్ధమయ్యారు.  దీనికి తోడు గిరిజన బాలికల వసతిగృహంలో బాలురు ఉన్నట్టు చూపించి నిధులు దారి మళ్లించడం మరో ఆసక్తి గొలిపే అంశం. 305 మంది విద్యార్థుల్లో కొందరు పురుషుల పేర్లు ఉండడంతో సదరు అధికారి ఉలిక్కిపడ్డారు. చేసేదిలేక ఆ అధికారి కలెక్టర్‌కు సమాచారం అందించారు.
 
 రాజకీయ పైరవీలు
 ఉపకార వేతనాలను హాస్టల్ మెస్‌చార్జీలుగా చూపించి కాజేసేందుకు ప్రయత్నించిన గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులు రాజకీయ పైరవీలకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ పెద్దలకు బంధువులమంటూ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఖాతాలు సృష్టించి నిధులు దారి మళ్లించడమే కాకుండా గిరిజన సంక్షేమ శాఖలో ఓ అధికారికి రూ.5లక్షలు ఇవ్వజూపిన గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులపై విచారణ ఎప్పటికి మొదలవుతుందో వేచిచూడాలి.
 
 అజయ్‌కుమార్‌కు ఓప్రైవేటు కాలేజీలో వాటా?
  ఈ వ్యవహారంలో ప్రభుత్వ సొమ్మును సొంత ఖాతాలకు మళ్లించి తిరిగి ఆ సొమ్మునే చెక్కుగా మార్చుకునే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి గురైన అజయ్‌కుమార్ పాలకొండ మండలం బుక్కూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో పాటు కారులో రూ.24లక్షల విలువైన చెక్కును పోలీసులు కనుగొన్నారు. ఇంత మొత్తంలో చెక్కు ఈయన చేతికి ఎలా చిక్కిందన్నది ప్రశ్న.  అజయ్‌కుమార్ పాలకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో వాటాదారునిగా ఉన్నట్టు చెబుతున్నారు. చెక్కు ఇచ్చిన అధికారి సస్పెన్షన్‌లో ఉండడంతో ఆ దిశగా పోలీసు విచారణ  మొదలైంది. అజయ్‌కుమార్ నోరు విప్పితే అసలు నిందితులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
 
 ఏసీబీ తనిఖీలు
 శ్రీకాకుళం టౌన్ : పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడున్న రికార్డులను స్వాధీన పరచుకుని పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వాన తనిఖీలు చేపట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను వెల్ఫేర్ అధికారికి  ప్రభుత్వం కేటాయించిన  బ్యాంకు ఖాతాను పరిశీలించారు. ఆ ఖాతాలో గిరిజన సంక్షేమ శాఖ విడుదల చేసిన డైట్ బిల్లులను మార్చి నెలలో ప్రభుత్వం చెల్లించింది. జూన్ నుంచి మార్చి నెల వరకు ఆ ఖాతాకు ఇతర నిధులేవీ చేరే అవకాశం ఉండదు. కాని ఈ ఖాతాలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. స్టేట్ బ్యాంకు నుంచి లావాదేవీలను సేకరించిన డీఎస్పీ రంగరాజు వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు