అన్న చెబితేనే...

9 Aug, 2018 11:46 IST|Sakshi

తెగని ‘ప్లేట్ల’ పంచాయితీ

ఐదు మండలాలకు నేటి నుంచి సరఫరా

ఆ రెండు మండలాలకు పెండింగ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు భోజనం చేసే ప్లేట్ల సరఫరాలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత తన పట్టు వీడలేదు. దీంతో ఎంఈఓలు కూడా ‘‘అన్న చెబితేనే’’ అని తెబుతుండడంతో ధర్మవరం, బత్తలపల్లి మండలాలకు ప్లేట్ల సరఫరా పెండింగ్‌లో పడింది. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. 

మార్చి నుంచే సరఫరా చేసినా...
జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న మొత్తం 3,29,145 మంది విద్యార్థులకు ప్లేట్లు సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్‌ స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీ సంస్థ టెండరు దక్కించుకుంది. జిల్లాలో రవాణా బాధ్యతలను విజయ్‌కుమార్‌ అనే వ్యక్తికి అప్పగించారు. మార్చి నెల నుంచే జిల్లా వ్యాప్తంగా సరఫరా చేయగా.. జూన్‌లోపు ధర్మవరం, బత్తలపల్లి, నార్పల, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మినహా తక్కిన అన్ని మండలాలకు సరఫరా చేసేశారు. 

వివరణ ఇచ్చినా... ఫలితం లేదు
ఏడు మండలాలకు సరఫరా చేయని విషయమై సంబంధిత ట్రాన్స్‌పోర్ట్‌ ప్రతినిధి విజయ్‌కుమార్‌కు విద్యాశాఖ నోటీసు జారీ చేసింది. దీనికి ఆయన వివరణ ఇస్తూ ‘‘56 మండలాలకు సరఫరా చేశాం. తక్కిన ఏడు మండలాలకు గాను ఐదు మండలాల ఎంఈఓలు తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ధర్మవరం, బత్తలపల్లి ఎంఈఓలు ససేమిరా అంటున్నారు..మేమైతే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వివరణలో పేర్కొన్నాడు. ఇప్పటికి 15 రోజులవుతున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు.

నేటి నుంచి ఐదు మండలాలకు సరఫరా
మిగిలిపోయిన ఏడు మండలాల్లో ధర్మవరం, బత్తలపల్లి మినహా తక్కిన ఐదు మండలాలకు గురువారం నుంచి ప్లేట్లు సరఫరా చేయనున్నారు. దీనిపై ట్రాన్స్‌ఫోర్ట్‌ ప్రతినిధి విజయ్‌కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ, ధర్మవరం, బత్తలపల్లి మండలాలకు సరఫరా చేసే విషయమై విద్యాశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. 

సరఫరా చేసి తీరాల్సిందే
ఏడు మండలాలకు కచ్చితంగా సరఫరా చేయాల్సిందే. ఎంఈఓలతో పనిలేదు. నేరుగా స్కూల్‌ కాంప్లెక్స్‌లో అందజేసి అక్కడి హెచ్‌ఎంలతో సంతకాలు చేయించుకోవాలని చెప్పాం. ఆ హెచ్‌ఎంలు తీసుకునేందుకు నిరాకరిస్తే  మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాని ఎంఈఓలు వద్దన్నారంటే కుదరదు.–దేవరాజు, విద్యాశాఖ ఏడీ   

మరిన్ని వార్తలు