గణితమంటే వణుకు.. ఆంగ్లమంటే బెరుకు..!

30 Jul, 2018 08:15 IST|Sakshi

పూర్తి స్థాయిలో సత్తా  చూపలేకపోతున్న విద్యార్థులు

పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల్లో అదే దుస్థితి

ఎన్‌సీఈఆర్టీ సర్వేలో తేలిన వాస్తవాలు దృష్టి పెట్టని విద్యాశాఖ అధికారులు

ఏటేటా తగ్గుతున్న విద్యార్థుల సామర్థ్యాలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారు. లెక్కలంటే వణికిపోతున్నారు.. ఆంగ్లమంటే బెదిరిపోతున్నారు.. విజ్ఞానశాస్త్రమంటే వెర్రిమొగం వేస్తున్నారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) ఇటీవల నిర్వహించిన జాతీయ సాధ న సర్వేలో ఈ విషయం బయటపడింది.

చిత్తూరు ఎడ్యుకేషన్‌ : జిల్లాలో విద్యావిధానం, వివిధ సబ్జెక్టుల్లో 3, 5, 8, పదో తరగతి విద్యార్థుల ప్రతిభపై ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఎన్‌సీఈఆర్టీ సర్వే నిర్వహించింది. ఈ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. సర్వేలో విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో వెనుకబడినట్లు తేలింది. ముఖ్యంగా గణితం, ఆంగ్లం, సైన్సు సబ్జెక్టుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సోషల్‌లోనూ ఆశాజనకంగా లేదు. చివరికి మాతృభాషలోనూ అంతంతమాత్రంగానే ఉండడం దురదృష్టకరం. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యాభ్యాసానికి వారధి పదో తరగతి. కీలకమైన ఈ తరగతిలో చదువుతున్న విద్యార్థులు ఆశించిన స్థాయిలో మెరుగైన ఫలితాలను చూపలేకపోతున్నారు.

టీచర్ల కొరతే ప్రధాన సమస్య..
పదో తరగతి విద్యాబోధనకు టీచర్ల కొరత లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం వలనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లాలోని 694 ఉన్నత పాఠశాలల్లో 483 మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. అందులో సబ్జెక్టుల వారీగా చూస్తే.. గణిత ఉపాధ్యాయులు తెలుగు మీడియం 52 మంది, ఉర్దూ మీడియం ఐదుగురు, తమిళంలో ఐదుగురు కొరత ఉన్నారు. అదేవిధంగా తెలుగు మీడియంలో ఫిజిక్స్‌ 25, బయలాజికల్‌ సైన్సు 65, సోషియల్‌ 149, ఇంగ్లిషు 41, తెలుగు 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జిల్లా పదో తరగతి ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు మూడేళ్లు వరుసగా 13వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. పదో తరగతి ఫలితాలలో విద్యార్థులు సరైన ప్రతిభ చూపకపోవడానికి అంతకు ముందు తరగతుల్లో పటిష్టమైన పునాదులు లేకపోవడమేనని విద్యావేత్తలు తేల్చిచెబుతున్నారు.

ప్రధాన లోపాలివే..
గణితం మీద విద్యార్థులకు ఉన్న భయం తొలగించకపోవడం
ప్రాజెక్టు విద్యావిధానంలో భాగంగా జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో గణితం బోధించకపోవడం
సూత్రాలు, సిద్ధాంతాలు బట్టీ పద్ధతి కాకుండా అవగాహన కల్పించడంలో టీచర్ల వెనుకబాటుతనం మారిన పాఠ్యాంశాలు
గణిత సిద్ధాంతాలను విశ్లేషణాత్మక బోధన చేయకపోవడం
గణితం, సైన్స్‌ తదితర పాఠ్యాంశాల పూర్తి తర్వాత పరీక్షలు నామమాత్రంగా నిర్వహించడం
పరీక్ష ఫలితాలను అనుసరించి అవసరమైన విద్యార్థులకు పునఃతరగతులు నిర్వహించకపోవడం
పాఠ్యప్రణాళికను సకాలంలో రూపొందించుకోకపోవడం
వెనుకబడిన విద్యార్థుల విషయంలో టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం
పాఠశాల స్థాయిలో హెచ్‌ఎంలు, మండల స్థాయిలో ఎంఈఓల తనిఖీలు తూతూమంత్రంగానే ఉండడం

ప్రాథమిక స్థాయిలో సరైన పునాదులు పడాలి
విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో అన్ని సబ్జెక్టుల్లోనూ సరైన పునాదులు పడినప్పుడే ప్రతిభ చూపగలుగుతారు. టీచర్ల కొరత, పిల్లలపై తల్లిదండ్రుల శ్రద్ధ లోపించడం వంటి కారణాలతో ప్రాథమిక స్థాయిలో గణితం బేసిక్స్‌ నేర్చుకోలేకపోతున్నారు.    – ముత్యాలరెడ్డి, గణిత ఉపాధ్యాయుడు, కుప్పంబాదూరు హైస్కూల్‌

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన
టీచర్లు తమకు నచ్చిన విధంగా కాకుండా సీసీఈ విధానాన్ని అనుసరించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలి. ఈ ఏడాది మరింతగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా, పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తాం.    – డాక్టర్‌ పాండురంగస్వామి, డీఈఓ

మరిన్ని వార్తలు