ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ అవస్థలు

31 Oct, 2017 08:09 IST|Sakshi

జిల్లాలో మొదటి దశలో 1,795 పాఠశాలల్లో

బయోమెట్రిక్‌ హాజరు అమలు

నెట్‌వర్క్‌ సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న టీచర్లు  

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి రామాపురం మండలం నల్లగుట్టపల్లె హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంగాధర్‌. నూతనంగా ఆ పాఠశాల ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్‌ విధానం ద్వారా నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బయోమెట్రిక్‌ మిషన్లు పంపిణీ చేశారు. అయితే అక్కడ నెట్‌వర్క్‌ సరిగా పని చేయకపోవడంతో ఇలా చెట్లు, పుట్టలు, గుట్టలు ఎక్కి మిషన్‌లో హాజరును నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రాయచోటి రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ హాజరు విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొదటి దఫాగా జిల్లాలోని 3,178 ప్రభుత్వ పాఠశాలలకు గానూ 1,795 పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్‌ విధానంతోనే నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు సంబంధించి బయోమెట్రిక్‌ మిషన్లు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బయోమెట్రిక్‌ హాజరును రెండు పూటలా ప్రవేశపెట్టడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు నెట్‌వర్క్‌ సమస్యలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గ్రామీణ , మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో నెట్‌వర్క్‌ సమస్య ఉంది. బయోమెట్రిక్‌ మిషన్లు పని చేయకపోవడంతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.

బయోమెట్రిక్‌ విధానానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఖచ్చితంగా పాటించి తీరాలన్న నిబంధనలు పెట్టడం, అందుకు బయోమెట్రిక్‌ మిషన్లు పని చేయకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోతున్నారు. పాఠశాలలకు బయోమెట్రిక్‌ విధానానికి అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించిన తరువాతనే ఇటువంటి వి«ధానాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విధంగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడిలతో మానసికంగా కుంగిపోయేటట్లు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసిన బయోమెట్రిక్‌ మిషన్లు నాసిరకంగా ఉన్నాయని, అందులో సరైన డేటా లేదని,  అందువల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా