బడిలో భయం భయం

17 Aug, 2018 12:22 IST|Sakshi
తాడిమర్రిలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం తరగతి గదిలో పెచ్చులూడి పడిన దృశ్యం ,తరగతి గది పెచ్చులూడిపడి విద్యార్థికి గాయాలు

తరగతి గది పెచ్చులూడిపడి విద్యార్థికి గాయాలు

కాలం చెల్లి పెచ్చులూడుతున్న తరగతి గదులు

దసరా సెలవుల్లోనైనా  మరమ్మతులు చేస్తారా?

ధర్మవరం: నియోజవకర్గంలో మొత్తం 244 ప్రభుత్వ పాఠశాలల్లో 22,492 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మొత్తం పాఠశాలల భవనాల్లో 60 శాతం బడుల్లో తరగతి గదుల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, భయం భయంగానే పాఠాలు చెబుతున్నారని అధికారులు గుర్తించారు. పాఠశాల నిర్మాణాలపై చెత్తాచెదారం పేరుకపోవడం, వర్షపునీరు నిల్వ ఉండటం వల్ల నీరు గోడల్లోకి ఇంకి ఇనుము తుప్పు పట్టి పెచ్చులు లేశాయని చెబుతున్నారు.

నియోజకవర్గంలో పరిస్థితి ఇలా..!
తాడిమర్రి మండల పరిధిలోని తురకవారిపల్లి, నార్సింపల్లి ప్రాథమిక పాఠశాలల్లో మూడు గదులు, బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఒక గది, పుల్లానారాయణపల్లి పాఠశాలలో ఒక గది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ముదిగుబ్బ మండల కేంద్రంలో 4 పాఠశాలలతోపాటు గంగిరెడ్డిపల్లి, రాళ్లనంతపురం, సంకేపల్లి, ఒడ్డుకిందతాండా, రామస్వామి తాండా, నాగలగుబ్బల, యాకర్లకుంటపల్లి, బ్రహ్మదేవమర్రి, కోటిరెడ్డిపల్లి, కొండగట్టుపల్లి, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, అడవి బ్రాహ్మణపల్లి తాండాల్లోని పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వాటికి తక్షణమే మరమ్మత్తులు చేయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు.
ధర్మవరం పట్టణంలో 13, ధర్మవరం మండల పరిధిలో 8 పాఠశాలల్లో తరగతి గదుల పరిస్థితి అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేయించాలని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది.
బత్తలపల్లి మండలంలో ముద్దనపల్లి, వేల్పుమడుగు, పోట్లమర్రి వెంకటగారిపల్లి, మాల్యవంతం, ఎం.చెర్లోపల్లి, తంబాపురం, కోడేకండ్ల, జలాలపురం, రాఘవంపల్లి గ్రామాల్లో తరగతి గదులు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఆయా పాఠశాలల పరిస్థితి గురించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఎంఈఓ తెలిపారు.

తరగతి గది పెచ్చులూడిపడి విద్యార్థికి గాయాలు
తాడిమర్రి: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి మీద పడటంతో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన స్థానిక ఎస్సీ హాస్టల్‌ విద్యార్థి సాకే.నరేంద్ర మధ్యాహ్నం 2గంటల సమయంలో తోటి విద్యార్థులతో కలిసి తరగతిలో పాఠాలు వింటుండగా పైకప్పు పెచ్చులూడి అతనిపై పడింది. ఆ విద్యార్థి తలకు తీవ్రగాయం కావడంతో క్లాస్‌లో ఉన్న హిందీ టీచర్‌ చంద్రకళ, ఇతర ఉపాధ్యాయులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.

కంప్యూటర్‌ గది కావడం వల్లే...
తొమ్మిదో తరగతి విద్యార్థులకు క్లాస్‌రూం మొదటి అంతస్తులో ఉన్ననప్పటికీ వాళ్లు అక్కడ అల్లరి చేస్తుండటంతో కిందున్న కంప్యూటర్‌ గదిలో వాళ్లకు పాఠాలు చెబుతున్నారు. అది కంప్యూటర్‌ గది కావడంతో పైకప్పునకు థర్మాకోల్‌తో పీఓపీ చేయించారు. దీనివల్ల ఆ గది పైకప్పు కనిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పైపెచ్చులు ఊడుతున్నాయనే విషయాన్ని గుర్తించలేకపోయారు.

పీఓపీతో తప్పిన పెనుప్రమాదం
పీఓపీ థర్మాకోల్‌ కారణంగా ప్రమాదకర పరిస్థితిని గుర్తించడానికి వీల్లేకుండా పోయినప్పటికీ దానివల్లే పెనుప్రమాదం తప్పిం చింది. పెచ్చులూడిన పైకప్పు థర్మాకోల్‌పై పడి తర్వాత విద్యార్థిపై పడటంతో ఓ మోస్తరు గాయంతో విద్యార్థి క్షేమంగా బయటపడ్డాడు. అదే నేరుగా విద్యార్థి తలపై పడి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది.

దసరా సెలవుల్లో మరమ్మతులు చేపట్టాలి
శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి. ఎంఈఓలు సూచించిన భవనాలకు దసరా సెలవుల్లో మరమ్మతులు చేపట్టి పాఠశాలలు తిరిగి తెరిచేసరికి పనులు పూర్తి చేయాలి. తాడిమర్రిలో పాఠశాల భవనం పెచ్చులు ఊడిపడి విద్యార్థి గాయపడిన సంఘటనల్లాంటివి పునరావృతం కాకూడదు.– అమరనాథరెడ్డి, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకుడు

మరిన్ని వార్తలు