నో గ్రాంట్‌..

20 Aug, 2018 09:01 IST|Sakshi
నెల్లూరు: పొదలకూరురోడ్డులోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను పునః ప్రారంభించి రెండు నెలలు దాటినా నేటికీ ఈ ఏడాదికి సంబంధించి పాఠశాలల నిర్వహణకు నిధులను విడుదల చేయలేదు. గత ఏడాది ఖర్చు పెట్టకుండా ఉన్న రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంది. దీంతో పాఠాలు బోధించేందుకు సైతం చాక్‌పీస్‌లు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. నేటికీ అధిక శాతం పాఠశాలల్లో రిజిస్టర్లు నిర్వహించని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుల వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు ఎప్పుడో 2006లో ఇచ్చే గ్రాంట్లను నేటికీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నెల్లూరు(టౌన్‌): ప్రభుత్వ పాఠశాలల్లో రిజిష్టర్ల నిర్వహణకు, బోధన సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 3,425 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో ప్రాథమిక 2,646, ప్రాథమికోన్నత 363, ఉన్నత 416 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,34,609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కో స్కూల్‌కు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7వేల వంతున నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీస్‌లు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్లు, కాగితాలు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఇంతే మొత్తాన్ని గత 2006వ సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నారు.

అదే విధంగా స్కూల్‌ నిర్వహణా గ్రాంటు కింద మూడు తరగతి గదులు ఉన్న పాఠశాలకు రూ.5వేలు, అంతకంటే ఎక్కువ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు రూ.10వేలు వంతున నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో మరుగుదొడ్ల, కుర్చీల రిపేర్లు, వాటర్‌పైపులు తదితర సమస్యల పరిష్కారం కోసం వినియోగించనున్నారు. దీంతో పాటు ప్రతి టీచర్‌కు రూ.5వేల చొప్పున నిధులును కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు ప్రతి కాంప్లెక్స్‌కు రీసోర్స్‌ సెంటర్‌కు రూ. 22వేలు, మండల రీసోర్స్‌ సెంటర్‌కు రూ. 80వేలును కేటాయిస్తున్నారు. అయితే రెండేళ్లుగా టీచర్‌కు ఇచ్చే రూ.5వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. గ్రాంట్‌ను పెంచమని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
గత ఏడాది రూ.10.80 కోట్ల నిధులు వెనక్కి 
ప్రతి ఏటా స్కూల్‌ గ్రాంట్‌ నిధులును ఆగస్టులోపు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది కొన్ని పాఠశాలలకు అక్టోబర్, మరికొన్ని పాఠశాలలకు నవంబర్‌ నెలల్లో నిధులను విడుదల చేశారు. అయితే 2017–18కు సంబంధించి, అంతకంటే ముందు మిగిలి ఉన్న నిధుల్లో ఖర్చు చేయని రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులను సర్వశిక్ష అభియాన్‌ అధికారులు సకాలంలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠశాలల అవసరాలకు ఇచ్చే నిధులను ఇతర వాటికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్‌ నిధులు వెనక్కి పోవడంతో చాక్‌పీస్‌లు, రిజిష్టర్, తెల్ల కాగితాలు ఏవైనా కొనాలన్నా, పాఠశాలల్లో మరమ్మతులు నిర్వహించాలన్నా, చీపుర్లు సైతం కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

మరుగుదొడ్లు నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు..
పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ ఈ విద్యా సంవత్సరం నుంచి  ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నట్లు సర్వశిక్ష అభియాన్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2015 విద్యా సంవత్సరం నుంచి నిధులు కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.1500, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2,500, ఉన్నత పాఠశాలల్లో రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది నుంచి డీఆర్‌డీఏ ద్వార వేతనాలు అందజేసే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డీఆర్‌డీఏ వేతనాలను నిలిపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్‌డీఏ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదని ఎస్‌ఎస్‌ఏ అధికారులు చెబుతుంటే, తమకు సంబంధం లేదని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.

నిధులు దారి మళ్లించడం దారుణం 
బడ్జెట్‌ ద్వారా మంజూరైన నిధులను వెనక్కి తీసుకోవడం, దారి మళ్లించడం చాలా దారుణం. ప్రభుత్వం చర్యలతో పాఠశాలల నిర్వహణ చాలా ఇ బ్బందిగా మారింది. ఉపాధ్యాయుల జేబుల్లో నుం చి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కావెంజర్స్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడం లేదు. పాఠశాలల్లో నిర్వహణ సరి గాలేదని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. –మోహన్‌దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్‌

ఈ ఏడాది నిధులు విడుదల కాలేదు 
పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. గత ఏడాది, అంతకు ముందు వివిధ పనులకు కేటాయించిన నిధులకు సంబంధించి ఖర్చు పెట్టకుండా మిగిలిన నిధులు రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్‌ చేసింది. పాఠశాలల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఆయా హెచ్‌ఎంలు ఖర్చు పెడుతున్నారు. నిధులు వచ్చిన తరువాత వారికి తిరిగి ఇచ్చేస్తాం. –విశ్వనాథ్, ప్రాజెక్ట్‌ అధికారి, సర్వశిక్ష అభియాన్‌ 

మరిన్ని వార్తలు