సుద్దముక్కకూ ఇబ్బందే..

21 Nov, 2018 11:14 IST|Sakshi
కొత్తపల్లె పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక ఇళ్ల నుంచి వాటర్‌ బాటిళ్లు తెచ్చుకొని మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

పాఠశాల విద్యపై ప్రభుత్వం చిన్నచూపు?

మంజూరుకాని అభివృద్ధి నిధులు ఆరు నెలలుగా ఎదురుచూపు

రూ.6.81 కోట్ల నిధులు పెండింగ్‌ ప్రధానోపాధ్యాయుల ఇబ్బంది

పాఠశాలలో చిన్నవస్తువు కొనాలన్నాకష్టంగానే ఉంది. విద్యపై ప్రభుత్వంచిన్నచూపునకు ఇది నిదర్శనం.పాఠశాలలు తెరిచిఆరు నెలలైనా అభివృద్ధి నిధులుమంజూరు కాలేదు. ఇచ్చే కొద్ది పాటినిధుల కోసం ఉపాధ్యాయులుఎదురు చూస్తున్నారు.జిల్లాలోని అన్ని పాఠశాలలకురూ. 6.81 కోట్ల మేరకు నిధులురావాల్సి ఉంది. నిర్వహణ కోసంఅప్పులు చేస్తూ హెడ్మాస్టర్లుఅవస్థలు పడుతున్నారు.

చిత్తూరు ఎడ్యుకేషన్‌/గుర్రంకొండ : జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు సర్వశిక్షా అభియాన్‌ పథకం కింద విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొంతమేర నిధులు మంజూరు చేస్తారు. పాఠశాల నిర్వహణకు వీటిని వెచ్చిస్తారు. ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, పాఠశాల అభివృద్ధి (స్కూల్‌ గ్రాంటు) నిధుల కింద మరో రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలలకు రూ. 17 వేల చొప్పున ఏటా విడుదల చేయాల్సి ఉంది. ఎమ్మార్సీ కార్యాలయం నిర్వహణ కింద మండలానికి రూ.80 వేలు,  స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ కింద రూ.22 వేలు చొప్పున  మంజూరు చేయాలి.  విద్యాసంవత్సరం ప్రారంభంలో తప్పనిసరిగా హెడ్మాస్టర్లకు లేదా పాఠశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా వీటి ఊసెత్తడం లేదు.

నిధుల ఖర్చు ఇలా..
జిల్లాలోని మూడు తరగతి గదులున్న పాఠశాలలు, అంతకన్నా ఎక్కువ గదులున్న పాఠశాలలకు తప్పనిసరిగా నిర్వహణ నిధులు మంజూరు చేస్తారు. సుద్దముక్కలు (చాక్‌పీస్‌లు), సున్నం వే యడానికి, చిన్నచిన్న విద్యుత్‌ మరమ్మతులు, తలుపులు, కిటికీల మరమ్మతులు, కుర్చీలు, బల్లల మరమ్మతులు, పాఠశాల పరిశుభ్రత,మరుగుదొడ్ల శుభ్రత లాంటి పనులకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కరెంటు ఛార్జీ లు, తాగునీటి సౌకర్యం కోసం కూడా ఈ నిధులను ఖర్చు చేసుకోవచ్చు. పాఠశాల అభివృద్ధి(స్కూల్‌గ్రాంటు) నిధులతో పరికరాలు కొనుగోలు, గ్రంథాలయానికి అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసుకోవచ్చు. పెన్నులు, పెన్సిళ్లు, నోటు పుస్తకాలు, డస్టర్లు వంటి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. స్కూల్‌ కాంప్లెక్సులకు మంజూ రు అయ్యే నిధులతో ఆయా క్లస్టర్‌ హెడ్మాస్టర్లు ఏడాదిలో రెండుసార్లు తనిఖీ చేయాల్సి ఉం టుంది. ఇందుకోసం రూ.6 వేల వరకు వినియోగించుకోవచ్చు. క్లస్టర్‌ సమావేశాలు, టీఏ, డీఏ, ఉపాధ్యాయుల సమావేశాల కోసం వినియోగించుకోవచ్చు.

పెండింగ్‌లో రూ.6.81 కోట్ల నిధులు..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈఏడాది అభివృద్ధి నిధులు, నిర్వహణ నిధుల కింద మొత్తం రూ.6.81 కోట్ల మేరకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయి.  జిల్లాలో 3,700 ప్రాథమిక పాఠశాలలకుగాను రూ.3.70 కోట్లు, 483 ప్రాథమి కోన్నత పాఠశాలలు, 612 ఉన్నత పాఠశాలలకుగాను రూ.1,86 కోట్లు, 66 ఎమ్మార్సీ కార్యాలయాలకు సంబంధించి రూ.52.80 లక్షలు, 330 స్కూల్‌ కాంప్లెక్స్‌లకుగాను రూ.72.60 లక్షలు మొత్తం రూ.6.81 కోట్ల మేరకు పాఠశాలలకు నిధుల మంజూరు పెండింగ్‌లో ఉంది. ఆరు నెలలుగా ఈ నిధులు మంజూరు కాకపోవడంతో సంబంధిత హెడ్మాస్టర్లు నానా కష్టాలు పడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి..
పాఠశాలల్లో నిర్వహణ హెడ్మాస్టర్లకు భారంగా మారింది. కొందరు అప్పు చేసి వస్తువులను కొనుగోలు చేసుకొంటున్నారు. కొన్ని పాఠశాలల్లో చాక్‌పీసుల కొనుగోలు కూడా కష్టమైంది. మరుగుదొడ్ల నిర్వహణ మాట దేవుడెరుగు. కనీసం పాఠశాలలకు తాగునీటి వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉన్నారు. గ్రంథాలయాలకు ఈ ఏడాది కొత్తపుస్తకాలు కొనలేదు. విద్యుత్‌ ఛార్జీల చెల్లింపులకు అప్పులు చేస్తున్నామని హెడ్టాస్టర్లు వాపోతున్నారు. ఎమ్మార్సీ కార్యాలయాల నిర్వహణ ఎంఈఓలకు భారమైంది. ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

త్వరలో నిధులుమంజూరవుతాయి
ఆరు నెలలుగా  అభివృద్ధి నిధులుగానీ, నిర్వహణ నిధులుగానీ మంజూరు కాలేదు. పలు రకాల నిధులు మంజూరు కావాల్సి ఉన్నాయి. త్వరలోనే అన్ని పాఠశాలలకు అభివృద్ధి నిధులు మంజూరవుతాయని ఆశిస్తున్నాం.– ఎం. సురేంద్రబాబు,ఎంఈఓ, గుర్రంకొండ.

మరిన్ని వార్తలు