ప్రభుత్వ విద్యకు మహర్దశ

1 Jun, 2019 12:28 IST|Sakshi

జూన్‌ 12న పునఃప్రారంభం కానున్న పాఠశాలలు

ఈ ఏడాది నుంచి విద్యార్థులకు బూట్ల పంపిణీ

ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్పున యూనిఫాం సిద్ధం

ఇప్పటికే పాఠ్య పుస్తకాలను మండలాలకు పంపిన విద్యాశాఖ

నూతన ప్రభుత్వ సారథ్యంలో వేగవంతమైన స్కూల్‌ రెడీనెస్‌ ప్రోగ్రాం

గుంటూరు ఎడ్యుకేషన్‌: కొత్త ప్రభుత్వ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. వేసవి సెలవుల అనంతరం ఈనెల 12న పునఃప్రారంభం కానుండటంతో స్కూల్‌ రెడీనెస్‌ ప్రోగ్రాం వేగవంతమైంది.  ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించిన ఫలితంగా, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని సర్వశిక్షా అభియాన్, జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి.

బూట్ల పంపిణీకి శ్రీకారం
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్‌ హైస్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన ఉచిత విద్యా బోధనతో పాటు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ ఏడాది నుంచి బూట్లు కూడా అందించనున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు రోజూ పాఠశాలలకు చేరుకునేందుకు ఇళ్ల వద్ద నుంచి సగటున కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల వరకూ నడవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉచితంగా అందజేసిన యూనిఫాం ధరించి పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనంపై ఆధారపడి వస్తున్న విద్యార్థులు కొందరు కాళ్లకు చెప్పులు సైతం ధరించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సైతం ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగా నీట్‌గా బూట్లు ధరించి ఆనందంగా వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 3,155 ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్‌ పాఠశాలల్లో చదువుతున్న 2,51,609 మంది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన తరువాత ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు పంపిణీ చేస్తారు. వీరిలో 1,23,953 మంది బాలురు, 1,27,656 మంది బాలికలు ఉన్నారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి నుంచి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఒక జత చొప్పున బూట్లు, రెండు జతల సాక్సులు పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. బూట్లు, సాక్సులు పంపిణీకి ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ. 254 చొప్పున ఖర్చు చేస్తోంది.

ఇకపై మూడు జతల చొప్పున యూనిఫాం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకూ రెండు జతల చొప్పున అందజేస్తూ వచ్చిన యూనిఫాంను ఈనెల 12న పాఠశాలలు తెరిచిన తరువాత మూడు జతల చొప్పున అందజేసేందుకు నిర్ణయించారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా 3,562 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,57,464 మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయనున్నారు. ఒక్కో జతకు రూ.200 చొప్పున మూడు జతలకు రూ.600 ఖర్చు చేస్తున్నారు. క్లాత్‌ రూపంలో కాకుండా సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా విద్యార్థుల కొలతలను తీసుకుని మంగళగిరిలోని వివిధ గార్మెంట్‌ సంస్థల్లో స్టిచ్చింగ్‌ చేస్తున్నారు. మండల పరిషత్, జెడ్పీ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ, కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ, ఏపీ మోడల్‌ హైస్కూళ్లలో 6,7,8 తరగతులకు, 19 మదర్సాల్లోని 2,483 మంది చొప్పున విద్యార్థులకు మూడు జతల చొప్పున ప్రభుత్వం ఉచిత యూనిఫాం పంపిణీ చేయనుంది.

8, 9 తరగతుల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో 8,9 తరగతులు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు 6,7 తరగతుల విద్యార్థులకు రవాణా ఖర్చుల కింద అందజేస్తున్న మొత్తాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో సైకిళ్ల రూపంలో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

పాఠ్య పుస్తకాలు సిద్థం
ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు  పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ విధంగా జిల్లాలోని 3,248 పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 19,68,161 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, గతేడాది జిల్లా పాఠ్య పుస్తక గోదాములో నిల్వ ఉన్న 2,05,489 పుస్తకాలు పోనూ మిగిలిన 17,02,059 టైటిళ్లకు ఎంఈవోలు ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పంపారు.
ప్రభుత్వం నుంచి ఎప్పటి కప్పుడు వచ్చిన పాఠ్య పుస్తకాలను 57 మండలాల వారీగా ఎంఈవో కార్యాలయాలకు పంపారు. వాటిని స్కూల్‌ కాంప్లెక్స్‌లకు పంపడం ప్రారంభించారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మండలాల వారీగా ఎంఈవోలు ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పంపారు. దాని ఆధారంగా ముద్రణ కేంద్రాల నుంచి జిల్లాకు వస్తున్న పాఠ్య పుస్తకాలను ఎప్పటి కప్పుడు మండల పాయింట్లకు చేరవేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 3,562ప్రభుత్వపాఠశాలల్లోని2,57,464మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయనున్నారు.జిల్లాలోని 3,155 ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి నుంచిచదువుతున్న  2,51,609 మందివిద్యార్థులకు పాఠశాలలు తెరిచిన తరువాత ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు పంపిణీ చేస్తారు.  

జిల్లావ్యాప్తంగా 3,248 పాఠశాలలోని విద్యార్థులకు 19,68,161 పాఠ్యపుస్తకాలు అవసరం.  గతేడాది జిల్లా పాఠ్య పుస్తక గోదాములో నిల్వ ఉన్న2,05,489 పుస్తకాలు పోనూ మిగిలిన 17,02,059 టైటిళ్లకు ఎంఈవోలుఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పంపారు.

పాఠశాలల ప్రాంగణాలను ఆహ్లాదకరంగాతీర్చిదిద్దేందుకు నిర్ణయం
మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతతో అందించేందుకు పాఠశాలల వారీగా ప్రధానోపాధ్యాయులతో పాటు ఏజెన్సీల నిర్వాహకులకు కచ్చితమైన మార్గదర్శకాలు ఇచ్చాం. ఎంఈవోల పర్యవేక్షణలో పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తాం. దీంతో పాటు మౌలిక వసతుల కల్పన, గోడలకు రంగులు వేయించడం వంటి కార్యక్రమాలను రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం.–ఆర్‌.ఎస్‌ గంగా భవానీ, జిల్లా విద్యాశాఖాధికారి

>
మరిన్ని వార్తలు