మళ్లీ అదే కథ!

6 Jun, 2018 08:02 IST|Sakshi
పాఠ్యపుస్తకాలు

వేళకు పాఠశాలకు ఉపాధ్యాయులు రాకుంటే... బయోమెట్రిక్‌ ఆధారంగా వేతనాల్లో కోత విధిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వస్తే ముఖ్యమైన పోటీ పరీక్షలు, ఎంసెట్‌ వంటివాటికి అభ్యర్థులను అనుమతించడం లేదు. కానీ ఎన్నో ఏళ్లుగా పాఠశాలలు తెరిచే సమయానికి శతశాతం పుస్తకాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తారేమోనని ఎదురు చూస్తున్నా... ఆ ఆశ తీరడంలేదు. ఈ సమస్యకు ఎప్పటికి పరిష్కారం దొరుకుతుందన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నలా మారిపోతోంది. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ పుస్తకాలు ఈ సారీ పూర్తిస్థాయిలో రాలేదు. అంటే మళ్లీ వీటికోసం తిప్పలు తప్పవేమో...

విజయనగరం అర్బన్‌ : జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పటికే అనధికారికంగా ప్రారంభించి తరగతులు మొదలెట్టేశాయి. వారి పరిధిలోని విద్యార్థులతో పుస్తకాలను కూడా కొనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ తంతు ఇప్పటికీ ప్రారం భం కాలేదు. ఈ వ్యవహారంపై శ్రద్ధచూపేంత తీరిక పాఠశాల విద్యాశాఖకు లేనట్టు కనిపిస్తోంది. గతేడాది విద్యాసంవత్సరం చివరి రోజునాటికి విద్యార్థుల ప్రమోషన్‌ జాబితాను విడుదల చేసి 

ఆ మేరకు పాఠ్యపుస్తకాలను అందజేయాలన్న లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయులు కూడా ఆ విధంగానే జాబితాలు అందించారు. కానీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ మాత్రం చేపట్టలేదు. సమయ పాలనపై పదే పదే హెచ్చరికలు జారీ చేసే ప్రభుత్వం నిర్దేశించిన రోజుకు పుస్తకాల పంపిణీ ఎందుకు చేయలేకపోతోందన్నది అందరిలోనూ నెలకొన్న సందేహం.

మొదలుకాని పుస్తకాల పంపిణీ ప్రక్రియ
సాధారణంగా ఈ పాటికే కనీసం 70 శాతం పుస్తకాల పంపిణీ పూర్తికావాల్సి ఉన్నా... ఆ మేరకు పంపిణీకి శ్రీకారం చుట్టలేదు. ఈ ఏడాది కూడా పుస్తకాల పంపిణీలో జాప్యం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకటి నుంచి పదోతరగతి వర కూ ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది 2 లక్షల 10 వేల మంది వరకూ పుస్తకాల కోసం జిల్లా విద్యాశాఖ 14.55 లక్షల పుస్తకాలకు ప్రతిపాదనలు చేసింది. ఇది గతేడాది కంటే సుమారు లక్ష పుస్తకాలు అదనం. జిల్లా నుంచి వెళ్లిన ప్రతిపాదనల డిమాండ్‌కు ఎప్పుడూ పాఠశాల విద్యాశాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తున్నప్పటికీ సకాలంలో పుస్తకాలను జిల్లాకు పంపిణీ చేసిన దాఖ లాలు మాత్రం కానరావడంలేదు. 

సమస్య పునరావృతమే...
గతేడాది డిమాండ్‌ పుస్తకాలు ఆలస్యంగా జిల్లాకు రావడం వల్ల సుమా రు రెండు లక్షల వరకూ పంపిణీ ఏడాది చివరి నెలలో జరిగింది. ఈ ఏడాది అలాంటి సమస్య రాకూడదని పుస్తకాల కోసం జిల్లా విద్యాశాఖ ఎదురుచూస్తోంది. ఇంతవరకూ తొలి విడతగా కేవలం 2 లక్షల 60 వేల పుస్తకాలు మాత్రమే జిల్లాకు వచ్చా యి. వీటితోపాటు గత ఏడాది మిగిలిన 1.79 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నాయి. ఇంకా 12.81 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఇక జిల్లాలో ఉన్నవాటిపైనా వెంటనే పంపిణీ చేయాలనే ఆలోచన జిల్లా విద్యాశాఖకు తట్టలేదు. జిల్లాకు వచ్చి మూడురోజులైనా మండలాలకు పంపించే ఏర్పాట్లు పూర్తవ్వలేదు. 

వచ్చినవి వచ్చినట్లు పంపేస్తున్నాం
ఇప్పటికే పాఠ్యపుస్తకాల పం పిణీ పూర్తి చేయాల్సి ఉంది, జిల్లాకు సకాలంలో రాకపోవడం వల్ల అది కుదరలేదు.  జిల్లాకు వచ్చిన పుస్తకాలను ఎప్పటికప్పుడు మండలాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం.గతేడాది మిగిలి న 1.79 లక్షల పాఠ్య పుస్తకాలు, తాజాగా వచ్చిన 2.60 లక్షల పాఠ్య పుస్తకాలను ప్రస్తుతం పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. నిల్వలకు అనుగుణంగా అన్ని మండలాలకు సమంగా పంచుతాం. కేటాయించిన పుస్తకాలను ముం దుగానే తేదీలను ప్రకటించి ఆయా మండలాలకు పంపిణీ చేస్తాం. ఏ మం డలాలకూ ఆలస్యం కాకుండా పంపిణీ చేస్తాం.       
  – జి.నాగమణి, జిల్లా విద్యాశాఖాధికారి, విజయనగరం 

మరిన్ని వార్తలు