-

ఆ కాంట్రాక్టరంటే ‘ఆరో’ప్రాణం!

8 Jan, 2014 00:52 IST|Sakshi

‘పులిచింతల’ నిర్మాణ గడువును ఆరోసారి పొడిగించిన ప్రభుత్వం

 సాక్షి, హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం ప్రత్యేక ప్రేమ చూపుతోంది. గత  డిసెంబర్‌లోనే నిర్మాణ గడువు ముగిసినప్పటికీ మళ్లీ మార్చి వరకు గడువు పొడిగించింది. పులిచింతల గడువు పెరగడం ఇది ఆరోసారి. సీఎం గత నెలలోనే ప్రాజెక్టును ప్రారంభించి, అదనపు నిధులు ఇవ్వడానికీ ముందుకొచ్చారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో  మంత్రి సుదర్శన్‌రెడ్డి గడువును పొడిగించారు. నిజానికి ఈ ప్రాజెక్టు మూడేళ్ల కిందటే పూర్తి కావాలి.

 కేవలం చీఫ్ ఇంజనీరు లేఖ ఆధారంగా: ప్రాజెక్టు నిర్మాణ గడువును పొడిగించాలంటే ప్రత్యేక పద్ధతి పాటించాలి. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు గడువు పెంపును ప్రతిపాదిస్తే, ఇంజనీర్ల కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. అప్పుడు గడువు పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరిస్తుంది. అయితే పులిచింతల విషయంలో ఈ ప్రక్రియను పక్కన పెట్టారు. చీఫ్ ఇంజనీరు లేఖ ఆధారంగా మంత్రి గడువు పెంపునకు ఆమో దం తెలిపారు. కాగా, అదనపు నిధుల కోసం కాంట్రాక్టరే నిర్మాణాన్ని ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అదన పు చెల్లింపులను చేసింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ప్రాజెక్టు నుంచి నీరు ఇస్తామని కూడా గతంలో ప్రకటించింది. అయితే ఆచరణలో మాత్రం మాట నిలబెట్టుకోలేదు.
 

మరిన్ని వార్తలు