బ్రాహ్మణులకు అండగా ప్రభుత్వం

27 Jan, 2020 05:37 IST|Sakshi
విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న మల్లాది విష్ణు

శాసనసభాపతి తమ్మినేని సీతారాం

ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గా మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం

భవానీపురం (విజయవాడ పశ్చిమ): బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను చిన్నచూపు చూసిందని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను అకారణంగా తొలగించడమే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. రాజకీయాల్లో మాటకు నిలబడే వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయనను బ్రాహ్మణులంతా ఆశీర్వదించాలని కోరారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. బ్రాహ్మణుల స్థితిగతులను మెరుగుపరచడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

బ్రాహ్మణ సంఘాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తానన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు గతంలో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి మార్చి 31లోగా పరిష్కరిస్తానని తెలిపారు. పేద బ్రాహ్మణులు, విద్యార్థులకు తిరుపతి, విజయవాడలో వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, రక్షణనిధి, మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, దేవదాయ శాఖ కమిషనర్‌ మొవ్వ పద్మ, టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, వైఎస్సార్‌సీపీ నేతలు బొప్పన భవకుమార్, దేవినేని అవినాష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు