25 వేలమంది ఉపాధికి గండి!

6 Oct, 2018 04:49 IST|Sakshi

మైనింగ్‌ మాఫియాకు సర్కారు అండ

పల్వరైజింగ్‌ మిల్లులకు సున్నపురాయి ట్రాన్సిట్‌ పాసుల నిలిపివేత

అక్రమ మైనింగ్‌ కట్టడికి చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు చూపించే ఎత్తుగడ

గుంటూరు జిల్లాలో 200 పైగా సున్నపుబట్టీలు మూతపడిన వైనం

పల్వరైజింగ్‌ మిల్లులదీ అదే దారి.. సున్నపుపొడి ఉత్పత్తిపై దెబ్బ

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తెల్ల సున్నపురాయి అక్రమ తవ్వకాల దందాతో వేల కోట్లు దండుకున్న మైనింగ్‌ మాఫియాను రక్షించేందుకు ప్రభుత్వం రకరకాల ఎత్తులు వేస్తోంది. అక్రమార్కులను వదిలేసి అన్ని పల్వరైజింగ్‌ మిల్లులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఖనిజ రవాణా పర్మిట్లు ఆపేసింది. ఈ మేరకు వివరాలను కోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ చర్యతో సుమారు 25 వేలమంది కార్మికుల ఉపాధికి గండిపడింది.

అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గత తొమ్మిదేళ్లుగా మరీ ముఖ్యంగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగిస్తున్న మైనింగ్‌ మాఫియా గురించి మైనింగ్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులందరికీ తెలుసు. ముఖ్యమంత్రితో సహా అందరికీ తెలిసి సాగుతున్న వ్యవహారమే కావడంతో అధికారులు అడ్డుకునే సాహసం చేయలేదు. అటవీ భూములు, రెవెన్యూ భూముల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో లోకాయుక్త నియమించిన అధికారి విచారణ జరిపి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

పల్నాడు ప్రాంతంలో యరపతినేని సాగిస్తున్న మైనింగ్‌ మాఫియావల్ల రాయల్టీ రూపంలో సర్కారుకు వేల కోట్ల నష్టం వాటిల్లిందంటూ హైకోర్టులో పిల్‌ దాఖలవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. మొత్తం వ్యవహారంపై నిగ్గుతేల్చి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తే సర్కారు బండారం బట్టబయలవుతుందనే ఉద్దేశంతో సర్కారు సీబీసీఐడీకి అప్పగించి నీరుగార్చే కుట్రపన్నింది.

అక్రమార్కులను వదిలి...
తాజాగా అక్రమ మైనింగ్‌ కొనసాగించిన వారిని వదిలేసి మొత్తం పల్నాడు ప్రాంతంలో ఖనిజ ట్రాన్సిట్‌ పాసులను ఆపేసింది. దీంతో తెల్ల సున్నపురాయి ఖనిజ సరఫరా నిలిచిపోయి గుంటూరు జిల్లాలోని 200 పైగా సున్నపుబట్టీలు మూతపడ్డాయి. బట్టీల్లో కాల్చిన సున్నపురాళ్లను పొడిచేసే వందపైగా పల్వరైజింగ్‌ మిల్లులు మూతపడ్డాయి.

దీంతో 22 నుంచి 25 వేలమంది కార్మికుల ఉపాధికి గండిపడింది. సక్రమంగా నడుస్తున్న మిల్లులకు ఖనిజ సరఫరాను ఆపేయడంవల్ల సున్నపుపొడి ఉత్పత్తి ఆగిపోయింది. దోషులను వదిలేసి తమ మిల్లులు మూతపడేలా చేశారంటూ పల్వరైజింగ్‌ మిల్లుల యజమానులు, సున్నపు బట్టీల వారు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. ఉపాధి కోల్పోయిన కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

అక్రమ మైనింగ్‌నిరోధించామని చెప్పడానికే..
మొత్తం అక్రమ మైనింగ్‌ను నిరోధించామని చెప్పడానికి, మైనింగ్‌ దందా సాగించిన అధికార పార్టీ ఎమ్మెల్యేను కాపాడేందుకే పల్వరైజింగ్‌ మిల్లులకు నోటీసులు జారీ చేసి, ఖనిజ రవాణా పర్మిట్లు ఆపేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగురాళ్లకు చెందిన పల్వరైజింగ్‌ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులు గనుల శాఖ సంచాలకులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.


దోషులను రక్షించడమే లక్ష్యం
యరపతినేని శ్రీనివాసరావు అక్రమ తవ్వకాలు సాగించారని లోకాయుక్త ప్రతినిధి నిగ్గుతేల్చారు. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, ఎమ్మెల్యేకు భయపడటం వల్లే అధికార యంత్రాంగం కట్టడిచేయలేకపోయినట్టుగా తమ విచారణలో తేలిందని నివేదికలో పేర్కొన్నారు.

ఇది జరిగి రెండేళ్లయినా స్పందించని సర్కారు ఇప్పుడు హైకోర్టు అక్షింతలు వేసినా దోషులను రక్షించి అమాయకులను శిక్షించే పనిలో పడింది. మైనింగ్‌ ఏడీ, డీడీలను సస్పెండ్‌ చేయడం ఇందుకు నిదర్శనం. మరోవైపు కోర్టుకు చర్యలు తీసుకున్నట్లుగా చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసి ఎమ్మెల్యేని కాపాడేందుకే గత దశాబ్దకాలంలో ఎంత ఖనిజాన్ని పొడిచేశారో లెక్కలు చెప్పాలంటూ పల్వరైజింగ్‌ మిల్లులకు నోటీసులు ఇచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు