రిజిస్ట్రార్‌పై దాడి ఎఫెక్ట్‌

17 Jun, 2018 09:46 IST|Sakshi

ఎస్‌ఎల్‌వీ విద్యాసంస్థల అఫిలియేషన్‌ రద్దు

రత్నప్పచౌదరిని సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు 

సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్‌) : రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అమర్‌నాథ్‌పై దాడి ఘటన పట్ల ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. బీఈడీ కళాశాలల స్టాఫ్‌ అప్రూవల్‌ విషయంలో  ఈనెల 5న రిజిస్ట్రార్‌పై ఎస్‌కే యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రత్నప్ప చౌదరి, కర్నూలు ఎస్‌ఎల్‌వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్‌ తిరుపతయ్య దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిపై కర్నూలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. దాడికి యత్నించినవారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయాన్ని బంద్‌ చేసి ఆందోళనలు చేపట్టారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో పలు సందేహాలకు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వర్సిటీ ఘటనపై  చర్యలకు పూనుకుంది. ఈమేరకు శనివారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎస్కేయూ, ఆర్‌యూ ఇన్‌చార్జ్‌ వీసీలకు పలు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఎస్కేయూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రత్నప్ప చౌదరిని సస్పెండ్‌ చేయాలని, ఎస్‌ఎల్‌వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్‌ తిరుపతయ్య కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. 


శుభపరిణామం 
ఆర్‌యూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ అమర్‌నాథ్‌పై దాడి ఘటనపై  ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించడం శుభపరిణామమని ఆర్‌యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్‌ శ్రీరాములు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవటం వర్సిటీ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది విజయమన్నారు.    

మరిన్ని వార్తలు