పగులుతున్న పాపాల పుట్ట

23 Sep, 2019 12:42 IST|Sakshi

గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, అధికారుల చేతివాటం 

మొన్న పొదుపు మహిళల సొమ్ము స్వాహా పర్వంలో ఇద్దరు సీసీలపై వేటు

రెండు రోజుల క్రితం డ్వామా ఏపీడీ సస్పెన్షన్‌ 

అంతకు ముందు వికలాంగులను లంచం అడుగుతూ అడ్డంగా దొరికిన ఏడీ

సాక్షి, ఒంగోలు: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, మంత్రులు, కార్యకర్తలతో పాటు కార్యాలయాల్లోనే అధికారులు, ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. టీడీపీ ఘోర ఓటమి పాలైంది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పారదర్శక పాలనకు చర్యలు చేపట్టారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టిన అధికారులు ఆయా కార్యాలయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దీంతో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

దివ్యాంగుల శాఖ ఏడీ లంచావతారం.. 
రెండు నెలల క్రితం వికలాంగుల శాఖలో అవినీతి లుకలుకలు బయటకు వచ్చాయి. ఆ శాఖ ఇన్‌చార్జ్‌ ఏడీగా పనిచేసిన బి.సింగయ్య ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుని నుంచి లంచం డిమాండ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికే ఆయన మూడు శాఖలకు ఇన్‌చార్జ్‌గా ఉంటూ గత ప్రభుత్వం అండతో అందిన కాడికి దోచేశారు. స్వచ్ఛంద సంస్థల నుంచి లక్షల రూపాయలను లంచాల రూపంలో వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.  దీంతో ఆయన్ను విధుల నుంచి పక్కన పెట్టి, వేరే జిల్లాకు బదిలీ చేశారు.

డీఆర్‌డీఏ–వెలుగులో సీసీల చేతివాటం: 
జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్‌డీఏ), వెలుగు సంస్థలో పనిచేస్తూ పొదుపు మహిళల నిధుల స్వాహాకు పాల్పడిన ఇద్దరు సీసీల (కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు)పై ఆ శాఖ పీడీ జి.నరసింహులు వేటు వేశారు. వీరిని సస్పెండ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసుకు ఆదేశించారు.  ఈవీ సుచంద్రరావు గతంలో దొనకొండ మండలం అరివేముల క్లస్టర్‌ సీసీగా పనిచేసే సమయంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు, స్త్రీనిధి సొమ్ము , గ్రామ ఆర్గనైజేషన్‌ నుంచి రూ.13.90 లక్షల నిధులను తన భార్య, తన బంధువుల ఖాతాలకు మళ్లించుకున్నాడు. ముందుగానే పథకం వేసుకున్న సీసీ సుచేంద్రరావు స్థానిక గ్రామ సమైక్య సంఘ సభ్యులను ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు, స్త్రీనిధి రుణాల కోసమని నమ్మించి వారి నుంచి ముందుగానే అదనపు చెక్‌లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం నమ్మకంగా  పెద్దగుడిపాడు గ్రామ సమాఖ్య సంఘం, గంగదేవి పల్లి గ్రామసమాఖ్య సంఘం, బేతేల్‌పురం గ్రామ సమాఖ్య సంఘం ఇలా పలు సంఘాల నుంచి పొదుపు మహిళల సొమ్మును నమ్మకంగా స్వాహా చేశాడు. అనంతరం  ఇటీవల జరిగిన బదిలీలలో సీఎస్‌పురం మండలానికి బదిలీపై వెల్లారు.

ఈయన స్థానంలో వచ్చిన సీసీ (కమ్యూనిటి కో–ఆర్డినేటర్‌)పాపారావు బాధ్యతలు చేపట్టారు. తరువాత కార్యాలయంలో రికార్డులు పరిశీలించడంతో నిధుల స్వాహా విషయం వెలుగు చూసింది. గతంలో పనిచేసిన సీసీ సుచేంద్రరరావు చేతివాటం బయటపడి చర్చనీయాంశమైంది. విషయం డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ దృష్టికి రావడంతో ఆయన మార్కాపురం వెలుగు ఏరియా కో–ఆర్డినేటర్‌తో విచారణ చేయించారు. విచారణలో నిధులు స్వాహా వాస్తవమని తేలింది. అవినీతికి పాల్పడిన వెలుగు సీసీపై సస్పెండ్‌ వేటు వేయడంతో పాటు క్రిమినల్‌ కేసుకు ఆదేశించారు. స్వాహా చేసిన నిధులను రికవరీ చేయాలని కూడా ఆదేశించారు.

ఇదిలా ఉంటే కొండపి మండలం అనకర్ల పూడి క్లస్టర్‌ (సీసీ)పని చేస్తున్న వి.కోటేశ్వరమ్మ గతంలో ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు సీసీగా పనిచేసేవారు. ఆ సమయంలో  (ఇందిర ఎస్‌హెచ్‌గ్రూపు)కు సంబంధించిన సభ్యురాలు ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఉన్నతిపథకం కింద తప్పెట సుశీలమ్మ భర్త నాగేశ్వరరావుకు 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలు మంజూరు చేశారు. అయితే ఇందిరా గ్రూపుపై తయారు చేసిన రూ.50 వేల చెక్‌ను సంబంధిత సభ్యురాలికి ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డులో గ్రౌండింగ్‌ (నివేదిక) చూపించారు. ఈ విషయం కూడా ఇటీవల నిర్వహించిన విచారణలో వెలుగు చూసింది. దీనిపై విచారించిన డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ వాస్తవం తేలడంతో ఆమెపై కూడా సస్పెండ్‌ వేటు పడింది.

బీసీ కార్పొరేషన్‌లో రూ.50.10 లక్షలు స్వాహా తాజాగా వెలుగులోకి... 
గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీగా పనిచేసిన ఎ.నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన బదిలీపై వెళ్లిన తరువాత కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈడీ కె.నాగముని కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తున్న సమయంలో గత ఈడీ బాగోతం బయటకు వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఆదరణ–2 పథకంను ప్రవేశపెట్టింది. ఈ ఆదరణ పథకంలో బీసీలకు వివిధ పనిముట్లను రాయితీ కింద అందించేందుకు చర్యలు చేపట్టింది. వృత్తిని బట్టి ఇస్త్రీ పెట్టెలు, సన్నాయి, మేళం, నాయిబ్రాహ్మణులకు కుర్చీలు, మత్స్యకారులకు పడవలు, ఇంకా చేతి పనిముట్లను అందిస్తున్నారు. బీసీల ఓట్ల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఆదరణ పథకం కింద విడుదల చేశారు. అయితే యూనిట్‌కు లబ్ధిదారుల తమ వాటా ధనంగా చెల్లించిన సొమ్ము మొత్తాన్ని ఈడీ నాగేశ్వరరావు, కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసినట్లు ఇటీవల అధికారుల విచారణలో తేలింది.

బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగేశ్వరరావు ఒక్కడే డైరెక్ట్‌గా నగదు డ్రా చేయకుండా కార్యాలయంలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ పావుగా వాడుకున్నాడు. మొత్తం రూ.50 లక్షలకు పైగా నిధులను దొడ్డిదారిన మింగేసేందుకు వ్యూహం పన్నాడు. ఇందుకు కార్యాలయ ఏఈవో ఎ.శ్రీనివాసరావు పేరు మీద రూ.8.05,000, జూనియర్‌ అసిస్టెంట్‌ వై.ఏడుకొండలు పేరు మీద రూ.12,23,500, వి.రాజేష్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌) పేరుమీద రూ.8,40,000, బి.వై.కమలేశ్వరరావు (డేటా ఎంట్రీ ఆపరేటర్‌) పేరు మీద రూ.5,50,000, మరో ఇద్దరు ఇతరుల పేరుమీద రూ.1,24,500, ఇంకొక వ్యక్తి పేరుమీద రూ.95,000, డీబీసీడబ్ల్యూవో కార్యాలయానికి చెందిన జూనియర్‌ అసిస్టెంట్‌ పివి.ఆంజనేయులు పేరుమీద రూ.45,000, తన (ఈడీ) పేరు మీద రూ.10,87, 500 లక్షల వరకు చెక్కుల రూపంలో బ్యాంకు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో తేల్చారు.

మొత్తం రూ.50,10,500 లక్షలను ఈడీ నాగేశ్వరరావు డ్రా చేశారు. డ్రా చేసిన నగదును కొంత ఆయా ఉద్యోగులకు ఇచ్చి మిగతా సొమ్ము ఈడీ నాగేశ్వరరావే స్వాహా చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు.  వీరితో పాటు కార్యాలయంలో కీలక సూత్రధారులుగా వ్యవహరించిన మహిళా సీనియర్‌ అసిస్టెంట్లు ఉన్నారు. వీరితో పాటు కార్యాలయ సబార్టినేట్‌ కూడా ఉన్నారు. వీరందరూ ఈడీ నాగేశ్వరరావు అవినీతి అక్రమాలకు సహకరించారన్న అభియోగం విచారణలో తేలింది. దీంతో మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ బీసీ కార్పొరేషన్‌ ఎండీ ఎం.రామారావు ఉత్తరుŠువ్ల జారీ చేశారు. వీరిపై క్రిమినల్‌ కేసులకు ఆదేశాలు జారీ చేశారు. బదిలీపై కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్లిన ఈడీ నాగేశ్వరరావును కూడా సస్పెండ్‌ చేశారు. 

డ్వామాలోని వాటర్‌షెడ్‌ పథకంలో అవినీతిపై ఏపీడీపై వేటు..
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో  గత ఐదేళ్ల కాలంలో అడ్డుఅదుపు లేని అవినీతి జరిగింది. అధికార పార్టీ అండతో అటు రాజకీయ నాయకులు, ఇటు కార్యాలయంలోని అధికారులు  ఎవరికి వారే తమ పలుకుబడితో చేతివాటం ప్రదర్శించారు. గుట్టు చప్పుడు కాకుండా లక్షల్లో ప్రజా ధనం లూటీ చేశారు. అందులో ఇటీవల ఒకటి వెలుగు చూసింది. చీమకుర్తి మండలం సండ్రపాటు వాటర్‌ షెడ్‌ పథకంలో రూ.2.86 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో తేలింది. ఈ విషయాన్ని తమ పలుకుబడితో బయటకు రానీయకుండా కార్యాలయానికే పరిమితం చేశారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు డైరెక్టర్‌ దృష్టికి సం బంధిత ఫైల్‌ని రానీయకుండా దాచిపెట్టారు.

అనంతరం ఆయన ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శీనారెడ్డి ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.  పాత పీడీ హయాంలో మరుగున పెట్టిన ఫైల్‌ ప్రస్తుత ప్రాజెక్టు డైరెక్టర్‌ టేబుల్‌పైకి వచ్చింది. ఆయన పరిశీలించిన అనంతరం నిధుల స్వాహాకు బాధ్యులైన వారిపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ శీనారెడ్డి ఏపీడీ భవానిని సస్పెండ్‌ చేశారు. ఈ అవినీతి  2016–17 ఆర్ధిక సంవత్సరంలో చీమకుర్తి మండలం సండ్రపాడు వాటర్‌ షెడ్‌ పథకం (డబ్ల్యూసీసీ) ఇన్‌చార్జ్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం జరిగింది. అప్పట్లో ఈమె అద్దంకి క్లస్టర్‌ ఏపీడీగా విధులు నిర్వహిస్తూనే  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పథకం అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడు పోస్టులకు విధులు నిర్వర్తించారు.  

వెలుగులోకి రాని అక్రమాలు ఎన్నో...
గత ప్రభుత్వం హయాంలో అటు రాజకీయ నాయకులు నీరు–చెట్టు పేరుతో అనేక కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచేశారు. ఈ అవినీతిలో అప్పటి జిల్లా అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. తమ వాటా ధనం తీసుకునే ప్రతి ఫైల్‌ని అడ్డగోలుగా నడిపారన్నది జగమెరిగిన సత్యం. కొన్ని అభివృద్ధి పనులు చేయకుండా అటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు పంచుకున్నవి ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిపై ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులతో విచారణ చేయిస్తే అవినీతి డొంక అంతా కదిలి, వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా