వికలాంగ సంఘాలతో ముఖ్య కార్యదర్శి చర్చలు విఫలం

1 Dec, 2013 01:58 IST|Sakshi

సమస్యలపై పోరు కొనసాగిస్తామన్న వికలాంగులు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు - వాటి పరిష్కారాల కోసం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికలాంగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వికలాంగ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ శనివారం సాయంత్రం వివిధ సంఘాలతో చర్చలు జరిపారు. గత డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని వికలాంగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వికలాంగుల పింఛన్‌ను మార్చిలోగా పెంచుతానని అప్పుడు సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో ఇచ్చే పారిశ్రామిక రాయితీలు, స్టడీసర్కిల్ ఏర్పాటు, ఇళ్ల మంజూరులో వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న జీవో అమలు ఈ రోజు వరకు ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. అసలు ఈ సమావేశాన్ని సీఎం నిర్వహించమన్నారా? లేక మీరే నిర్వహించారా? అని ప్రశ్నించగా, తానే నిర్వహిస్తున్నట్లు నీలం సహానీ చెప్పినట్లు సమాచారం. దీంతో వికలాంగ సంఘాలు ఈ చర్చలను తాము అంగీకరించలేదని తేల్చి చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. సమావేశం అనంతరం వికలాంగ హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ వికలాంగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రపంచ వికలాంగ హక్కుల దినోత్సవాన్ని బ్లాక్‌డేగా జరుపుకుంటామని చెప్పారు. అన్ని జిల్లాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి వికలాంగులు నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఎక్కడ కార్యక్రమంలో పాల్గొన్నా అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు