బడికి రాకపోతే చర్యలే..!

26 Jun, 2020 12:47 IST|Sakshi

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో మూడు రోజుల సమయమిస్తామని, ఆలోపు 100 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఎలాంటి సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కావలి, గూడూరు, నెల్లూరు డివిజన్ల వారీగా పాఠశాలలకు రాని ఉపా«ధ్యాయుల వివరాలను ఆయా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు సేకరించారు. జిల్లాలో రెండు వేల మందికిపైగా ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు.

అయితే వీరిలో దాదాపు వెయ్యి మంది వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఉండటం, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. వీరికి పాఠశాలల హాజరుకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. మరో వెయ్యి మందికి పైగా టీచర్లు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. వీరికి త్వరలో మెమోలు జారీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం మ«ధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు