రాత మారుస్తున్న గీతలు

9 Jun, 2014 23:57 IST|Sakshi
రాత మారుస్తున్న గీతలు

 కోటగుమ్మం (రాజమండ్రి) :దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందించాలనే లక్ష్యంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంలో తలెత్తిన సమస్యల వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ అనుసంధానంతో బయోమెట్రిక్ మెషీన్ ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు, ఐరిష్ ఆధారంగా పింఛను పంపిణీ జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసుల ద్వారా, అర్బన్ పరిధిలో ఐసీఐసీఐ బ్యాంక్ అనుసంధానంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియ చేపడుతున్నారు. పింఛన్లు ఇచ్చేముందు బయోమెట్రిక్ మెషీన్‌లోని వేలిముద్రలతో లబ్ధిదారుడి వేలిముద్రలు సరిపోతేనే పింఛను అందిస్తారు. లేకుంటే వారికి పింఛను నిలిచిపోయినట్టే.
 
 వేలిముద్రలు సరిపోలక వెనుదిరుగుతూ..
 వేలిముద్రలు సరిపోలక జిల్లాలో 11 వేల మందికి పింఛన్లు అందడం లేదు. వృద్ధుల వేలిముద్రలు అరిగిపోయి ఉండడం, బయోమెట్రిక్ మెషీన్‌లో సరి పోలక (మేచింగ్) పింఛన్లు నిలిపివేస్తున్నారు. ప్రతి నెలా పోస్టాఫీసు, బ్యాంకు అధికారులు ఏర్పాటు చేసిన సెంటర్లకు వెళ్లిన వృద్ధులకు మెషీన్ వేలిముద్రలు స్వీకరించకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి నెలకు వచ్చే రూ. 200 పింఛను కోసం రూ.50 ఆటోలకు ఖర్చుచేసి వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ మెషీన్‌లో లోపాల వల్ల తాము పింఛను కోల్పోవాల్సి వస్తోందని వృద్ధులు వాపోతున్నారు. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు