ప్రభుత్వ భూములు పరిరక్షించాలి

13 Aug, 2013 05:48 IST|Sakshi
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియలో మండలాధికారులంతా పాల్గొనాలని, భూము ల పరిరక్షణకు కృషిచేయాలని జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్ సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాక్రాంతమైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి జీవో నంబర్ 571 ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన ప్రొఫార్మాలో సంబందింత శాఖ సెక్రటరీ ద్వారా దరఖాస్తు ఇవ్వాలన్నారు. రూ.50 లక్షల లోపు భూమిని కలెక్టర్ ఇస్తారని, అంతకంటే ఎక్కువ ధర ఉంటే సీసీఎల్‌ఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో గోదావరి వరద ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తించామని, వీటిలో భద్రాచలం డివిజన్‌లో ఎనిమిది మండలాలు, పాల్వంచ డివిజన్ ఆరు మండలాలు ఉన్నాయని తెలిపారు.
 
 వరదలతో నష్టపోయిన ఒక్కో భాధిత కుటుంబానికి తక్షణ సాయంగా 20 కిలోల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్ అందించినట్లు తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందకు చర్యలు తీసుకుంటామన్నారు. వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యాక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని మలేరియా అధికారిని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు. వరదనష్టాన్ని గుర్తించి, సహాయక కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, డీఎంఅండ్‌హెచ్‌వో భానుప్రకాష్, డీఆర్‌డీఏ పీడీ పద్మాజారాణి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు