చెత్తా బంగారమే!

2 Aug, 2015 02:45 IST|Sakshi
చెత్తా బంగారమే!

- వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తికి కసరత్తు
- జిల్లాలో తొలిసారిగా తిరుపతిలో యూనిట్
- ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం
- ఈ నెలాఖరులోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
చిత్తూరు (అర్బన్):
‘ చెత్త చెత్త కాదు. సద్వినియోగపరిస్తే మళ్లీ ఉపయోగపడుతుంది. చెత్తను రీసైకిల్ చేద్దాం. రీ యూస్ చేద్దాం. చేయిచేయి కలుపుదాం. చెత్తపై సమరం సాగిద్దాం..’  అంటూ మునిసిపల్ అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్లలో వినిపించే రింగ్‌టోన్ నిజం కానుంది. జిల్లాలో ఉపయోగపడదని మనం పారబోసే చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి నగరంలో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి చకచకా పనులు సాగుతున్నాయి.
 
జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్ల నుంచి రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపైకి వచ్చి పడుతోంది. ఈ మొత్తం వ్యర్థాలను ఆయా పరిధిల్లోని డంపింగ్ యార్డుల్లో వేయడం.. వీటిని తడి, పొడి చెత్తగా వేరుచేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తను మళ్లీ ఇతర ప్రాంతాల్లో పడేయడం స్థానిక సంస్థలకు భారంగా మారుతోంది. అయితే ఇలా వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే ఆలోచన ఆరేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. కానీ వ్యయం ఎక్కువ అవుతుందని, చెత్త సైతం భారీ మొత్తంలో కావాలని గతంలో కొందరు అధికారులు ఇచ్చిన సమాచారంతో ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పడేసింది.

అయితే ఇటీవల సింగపూర్‌కు వెళ్లొచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చూసి.. ఇదే తరహాలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనీసం ఒక్కో చోట ఏర్పాటు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. రెండు రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన మునిసిపల్ కమిషనర్ల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలిచ్చారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి తక్కువ మొత్తం వ్యర్థాలు చాలని, జిల్లాలో తొలిగా తిరుపతి నగరంలో ఈ ప్రాజెక్టు నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ వినయ్‌చంద్‌కు చెప్పారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ సమీక్షించాలని సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రాజెక్టు ఏర్పాటుకు జోరుగా పనులు ప్రారంభమవుతున్నాయి.
 
ఇలా తయారీ...
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే 350 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అవసరం. తిరుపతి కార్పొరేషన్‌లో రోజుకు సగటున 234 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీంతో పాటు చిత్తూరులో 80 టన్నులు, శ్రీకాళహస్తి నుంచి 42 టన్నులు, పుత్తూరు నుంచి 30 టన్నులు, నగరి నుంచి 22 టన్నుల చెత్తను తిరుపతికి తరలించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోజుకు మొత్తం 400 మెట్రిక్ టన్నుల చెత్తను తిరుపతికి తరలిస్తారు. ఆ చెత్తను మండించి రోజుకు 2 నుంచి 8 మెగా వాట్ల విద్యుత్ తయారు చేస్తారు.
 
ప్రాజెక్టు ఏర్పాటుకు తిరుపతిలో 3 నుంచి 6 ఎకరాల స్థలం వెంటనే సిద్ధం చేయాలని ప్రభుత్వం కలెక్టర్, తిరుపతి కమిషనర్‌ను ఆదేశించింది. నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇవ్వగానే నెలాఖరులోపు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడానికి అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు