ప్రభుత్వ విప్ ‘చింతమనేని’

21 Jun, 2014 03:32 IST|Sakshi
ప్రభుత్వ విప్ ‘చింతమనేని’

సాక్షి, ఏలూరు : తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మంచి అవకాశం దక్కింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌గా  శుక్రవారం ఎంపికయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రభాకర్‌కు ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశించారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయనకు విప్ పదవి దక్కింది. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు, మిత్రపక్షమైన బీజేపీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావుకు కేబినెట్‌లో చంద్రబాబు స్థానం కల్పించారు.

సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్లకు అవకాశం ఇవ్వకపోవడంతో వారు కొంత అసంతృప్తితో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్‌ను విప్‌గా నియమించడంతో ఆ వర్గం వారిని కూడా శాంతింపజేసినట్టయ్యింది. నిత్యం వివాదాల్లో ఉంటారనే విమర్శలు ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న వారి సమస్యలు తీర్చడంలో ముందుంటారనే పేరును చింతమనేని సంపాదించారు. ఆయనకు విప్ పదవి దక్కడంతో అనుచర గణం సంబరాల్లో మునిగింది. జిల్లాకు ఇప్పటివరకూ రెండు మంత్రి పదవులు, ఒక విప్ పదవి లభించడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు