‘పవరే’ పరమార్థమా!

3 Mar, 2015 02:52 IST|Sakshi

 ఎచ్చెర్ల, పొందూరు:థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన ఎస్‌ఎంపురం-ధర్మపురం, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ల చుట్టూనే తిరుగుతోంది. జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ, జెన్‌కోలు కలిసి ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం సోంపేట, పలాస, పోలాకి ప్రాంతాల్లోనూ భూములను పరిశీలించినా.. ఎస్.ఎం.పురం-ధర్మపురం ప్రాంతాల్లో ఏర్పాటుకే సుమితొమొ ఆసక్తి చూపుతోందని విప్ ఏకపక్షంగా చెప్పిడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ నాలుగు ప్రాంతాలను పరిశీలించేందుకు ఆ సంస్థ ప్రతినిధి బృందం జిల్లాకు నేడో రేపో రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకపోగా ఇక్కడ అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయని కూన ప్రకటించడంపై నిరసన వ్యక్తమవుతోంది.
 
 పట్టు కోసమేనా..? : కాగా ఎస్.ఎం.పురం   ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉండగా, ధర్మపురం ఆమదలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండల ంలో ఉంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు ప్రమేయం లేకుండానే ఆమదలవలస ఎమ్మెల్యే అయిన రవికుమార్ ఈ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి స్థలాలు పరిశీలించారు. తాజాగా ఆదివారం కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహంతో కలిసి మరోసారి పరిశీలించారు. ఎస్.ఎం.పురం ఏపీ గురుకుల పాఠశాలలో ఇదే అంశంపై వారిద్దరూ రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపినా అదే గ్రామానికి చెందిన జెడ్పీ చైర్‌పర్సన్ చౌదిరి ధనలక్ష్మికి గానీ, స్థానిక సర్పంచ్ అయిన ఆమె కుమారుడు చౌదిరి అవినాష్‌కు గానీ సమాచారం లేదు.
 
 భూములెక్కడ..?
 పోనీ విప్ చెబుతున్నట్లు భూములు అందుబాటులో ఉన్నాయా అంటే.. అదీ లేదు. ప్రాజెక్టుకు 2600 ఎకరాలు అవసరమని నిర్ణయించగా ఎచ్చెర్ల పరిధిలో ఎస్సీ రైతులకు పట్టాలుగా ఇచ్చిన 75 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎస్.ఎం.పురం పరిధిలో 122 సర్వే నెంబర్‌లో 790 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా.. అందులో 130 ఎకరాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి, 50 ఎకరాలు 21వ శతాబ్ది గురుకులానికి, 100 ఎకరాలు రాజీవ్ స్వగృహకు, 20 ఎకరాలు ఏపీ గురుకుల పాఠశాలకు ఎప్పుడో కేటాయించారు. మిగిలింది నిర్మాణాలకు సైతం పనికి రాని కొండ ప్రాంతమే. ఇక పొందూరు మండలం ధర్మపురంలో కూడా ఎస్సీ రైతులకు పట్టాలు ఇచ్చిన సుమారు 200 ఎకరాల భూములే ఉన్నాయి.
 
 ఈ పరిస్థితుల్లో ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రైతుల నుంచి తీసుకోక తప్పదు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా ధర రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షలు ఉండగాఅధికారులు మాత్రం రూ.5 లక్షలే ఉందని అంటున్నారు. ప్రభుత్వ విప్ మాత్రం తుళ్లూరు ప్రాంతంలా ఇక్కడి రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయి పోతారని, ఇంటికో ఉద్యోగం సైతం వచ్చేస్తుందని త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారు. అధికారుల కోణం మరోలా ఉంది. ఈ ప్రాంతం పొందూరు రైల్వేస్టేషన్‌కు, సముద్రతీరానికి దగ్గరగా ఉండటంతో పాటు ప్రాజెక్టుకు మడ్డువలస ప్రాజెక్టు నీరు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో దీని వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. వీరందరి ఆలోచనలు, పట్టుదలలు ఎలా ఉన్నా గ్రామాలు, పంట భూములను కాలుష్య కోరల్లోకి నేట్టే పవర్ ప్లాంట్ వద్దే వద్దని ఆందోళనలు ప్రారంభించారు.
 
 పట్టాలు లాక్కుంటే ప్రతిఘటిస్తాం
 ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ఆలోచన విరమించుకోవాలి. పంట భూములను పనికిరాని భూములని అనటం ప్రభుత్వ విప్‌కు తగదు. పట్టాలు లాక్కోవాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు.
 - గుడివాడ కుప్పయ్య,
 బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి
 
 కాలుష్య కోరల్లోకి నెట్టొద్దు
 ప్రభుత్వం గతంలో 112 సర్వే నెంబర్‌లో ఎస్సీ విలాంగులకు భూమి పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు లాక్కోవాలని చూస్తే సహించేది లేదు. గ్రామాలను కాలుష్య కోరల్లోకి నెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి.
 -ఎ.అప్పారావు, దళిత నాయకుడు
 

మరిన్ని వార్తలు