ఇవి ప్రజా కంటక ప్రభుత్వాలు

14 Dec, 2014 03:30 IST|Sakshi

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ
 పాతగుంటూరు: ప్రజలు బీజేపీ, టీడీపీలను నమ్మి కేంద్రం, రాష్ట్రంలో పూర్తి మెజార్టీని ఇస్తే అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శనివారం వామపక్ష పార్టీల సభ జరిగింది. ఈ సభకు ఎంసీపీఐ(యూ) పార్టీ జిల్లా కార్యదర్శి టి.శివయ్య అధ్యక్షత వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు నల్లధనాన్ని వెలికితీస్తామని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని అన్నారు.
 
  రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తే భవిష్యత్తులో నెలకొనే సమస్యలపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అర్హులైన వారికి వెంటనే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి ఎన్.భవన్నారాయణ, సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, రాజేష్, అయ్యన్నస్వామి, పూర్ణ తదితరులున్నారు.
 

మరిన్ని వార్తలు