-

గుడ్డి ప్రభుత్వాలను కూలగొట్టండి

28 Dec, 2013 00:42 IST|Sakshi
గుడ్డి ప్రభుత్వాలను కూలగొట్టండి

పెడన, న్యూస్‌లైన్ : దేశంలో, రాష్ట్రంలో గుడ్డి ప్రభుత్వాలు అధికారం చెలాయిస్తున్నాయని, వాటిని కూకటివేళ్లతో కూలగొట్టండని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పిలుపునిచ్చారు. పెడనలో నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ శుక్రవారం ఏర్పాటుచేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సభలో నాని మాట్లాడుతూ ఎంపీలు, కేంద్రమంత్రులు మూడు నెలల అధికారం కోసం సీమాంధ్రలో ఉన్న ఆరున్నర కోట్ల ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారని, తమ వ్యాపార లావాదేవీల ముసుగులు ఎక్కడ బయట పడతాయోననే భయంలో ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ అవసరం తీరాక తెప్పతగలేసే రకంగా మారాయన్నారు. వైఎస్ హయాంలో విభజనవాదం వినిపించకుండా చేశారని, ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్ సర్కార్ల అసమర్థత వల్లే విభజన వాదం బయటికొచ్చిందని విమర్శించారు.

ఎన్టీఆర్ నడిచిన బాటలో ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని, అందుకే టీడీపీ నేతలు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు. బందరు మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ నాగార్జున సాగర్‌లో నీరున్న దాళ్వా ఉందా లేదా అని ఇంతవరకు జిల్లా మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విడ్డూరమన్నారు. స్థానిక రైతులందరూ దాళ్వాకు సిద్ధంకావాలని, తాము పోరాటం చేసి సాగునీరు విడుదల చేయించేందుకు నడుంబిగిస్తామని భరోసా ఇచ్చారు.

పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే డెల్టా ప్రాంతం ఎడారిగా మారి కోస్తా తీర ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ బందరు పార్లమెంటు కన్వీనర్ కుక్కల విద్యాసాగర్, అవనిగడ్డ సమన్వయకర్త సింహాద్రి రమేష్, నేతలు ఉప్పాల రాము, మావులేటి వెంకట్రాజు, మాదివాడ రాము, బొడ్డు శ్యామలాదేవి, పిచ్చుక శంకర్, అంకెం సముద్రయ్య, ముత్యాల నాగేశ్వరరావు, సంగా మధు, యాళ్ల బాబులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు