రైతులను విస్మరించిన ప్రభుత్వాలు

17 Jul, 2015 01:08 IST|Sakshi

శ్రీకాకుళం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వ్యవసాయ రంగాన్ని విస్మరించాయని కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను సైతం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షడు రాహుల్‌గాంధీ నెల 24వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నందున.. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అత్యధికంగా అనంతపురం జిల్లాలో అన్నదాత బలవన్మరణాలకు పాల్పడడం విచారకరమన్నారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతోపాటు..
 
 ఇతర రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించేందుకే రాహుల్ పర్యటిస్తున్నట్టు వివరించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు అడ్డగోలు హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు ఊసే లేదన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి కూడా ప్రజలను పక్కదోవ పట్టించేందుకు సెక్షన్-8 తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో 27 మంది చనిపోయారంటే అది చంద్రబాబు చేసిన హత్యలేనని విమర్శించారు. బాధ్యతగల వ్యక్తిగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కిల్లి రామ్మోహనరావు, చౌదరి సతీష్, పుట్టా అంజనీకుమార్, ఎం.ఎ.బేగ్, గంజి ఎజ్రా, పైడి రవి, నంబాళ్ల రాజశేఖర్, ఈశ్వరి  పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు