ప్రగతి పథంలో పరుగులు

17 Jun, 2020 04:28 IST|Sakshi
రాజ్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌.

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం భావితరాల అభ్యున్నతికి కీలక చర్య. 97 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియాన్ని ఆమోదించారు. మంచి విషయం విరోధులకు ఇబ్బందిగా ఉంటుంది.  అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని ఆశిస్తున్నా

పాలనను క్షేత్రస్థాయి వరకు వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం. రైతుల కోసం ‘వైఎస్సార్‌ జనతా బజార్లు’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది

సాక్షి, అమరావతి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పరిపాలనా వికేంద్రీకరణ కీలకమని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానులను ఏర్పాటు చేసేందుకు శాసన ప్రక్రియ చేపట్టిందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ మంగళవారం రాజ్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక పాదయాత్ర స్ఫూర్తితో రాష్ట్రం సంక్షేమ పథంలో సాగుతోందని, అన్ని రంగాల్లో పురోగమిస్తోందని చెప్పారు. జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధి రేటుతో ఏపీ ప్రగతిపథంలో పరుగులు తీస్తోందన్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో రాష్ట్రం సమర్థంగా వ్యవహరిస్తోందన్నారు. మున్ముందు మంచి రోజులు వస్తాయని, ప్రజా జీవితం సజావుగా సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..

దేశ సగటు కంటే మెరుగ్గా రాష్ట్ర ఆర్థిక వృద్ధి...
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నా కోవిడ్‌–19కు ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతి సాధించింది. 2019–20లో 8.16 శాతం వృద్ధిరేటు సాధించడం విశేషం. జాతీయ వృద్ధి రేటు 5 శాతం కంటే ఏపీ అదనంగా 3.16 శాతం వృద్ధి సాధించింది. సేవల రంగంలో 9.1 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాలు 8 శాతం, పారిశ్రామిక రంగం 5 శాతం వృద్ధిరేటు నమోదు చేశాయి. 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,51,173 ఉండగా 2019–20లో 12 శాతం పెరిగి రూ.1,69,519కు చేరింది. 
గవర్నర్‌ ప్రసంగాన్ని వింటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు, సభ్యులు 

ఉన్నత భవితకే ఆంగ్లం..
► విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సులు, పాఠ్యపుస్తకాలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంగ్లంలో నైపుణ్యాలు సాధించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. మన బడి నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు తొలిదశగా 15,715 పాఠశాలలను ఎంపిక చేసి రూ.3,387కోట్లు మంజూరు చేశాం. మూడేళ్లలో 45 వేల పాఠశాలలను సదుపాయాలతో తీర్చిదిద్దుతాం.

మహాభాగ్యంగా ఆరోగ్యం 
వైద్య చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,534 కోట్లు ఖర్చు చేసి 6.25 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చింది. 12 వేల వైఎస్సార్‌ క్లినిక్‌లను ప్రారంభించడానికి ప్రణాళిక  రూపొందించింది. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం ఉన్న 11 బోధనాసుపత్రులకు అదనంగా మరో 16 ఆసుపత్రులను ప్రభుత్వం నెలకొల్పనుంది.

పండగలా వ్యవసాయం...
► వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా 49.44 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ రూ.10,209.32 కోట్లు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. దేశంలో మునుపెన్నడూలేని విధంగా కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూర్చింది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల అవసరాలను తీర్చేందుకు గ్రామాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 
► ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల పునరావాసం కోసం ప్రభుత్వం రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తోంది.  గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు నిరాకరించగా మా ప్రభుత్వం వారికి కూడా పరిహారం చెల్లించింది. 
► రూ.7 వేల కోట్లతో 30 లక్షల మంది పేదలకు  ప్రభుత్వం ఇళ్ల స్థలాలు సమకూరుస్తోంది. నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మిస్తుంది. 15 లక్షల ఇళ్ల పనులు ఆగస్టులో మొదలవుతాయి.

మహిళా సాధికారిత లక్ష్యంగా..
► పొదుపు సంఘాల మహిళల కోసం ప్రభుత్వం రూ.1,400 కోట్లు జమ చేసింది. ప్రతి సంఘం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పొందుతోంది. సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మంది ప్రయోజనం పొందారు. పొదుపు సంఘాల రుణాలు రూ.27 వేల కోట్లను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తాం. 
► వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 – 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.
► మహిళా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 
► జలయజ్ఞం పనుల కింద 54 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. 14 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఇతర ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదే వెలిగొండ, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండో దశ, వంశధార– నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం పూర్తి చేస్తాం. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 50 వేల క్యూసెక్కులకు పెంచేందుకు చర్యలు చేపట్టింది.

త్వరలో నూతన పారిశ్రామిక విధానం..
► గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన రూ.4 వేల కోట్ల పారిశ్రామిక పోత్సాహకాలను మా ప్రభుత్వం చెల్లించింది. అతి త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానం తెస్తాం. ఏపీఐఐసీ ద్వారా 1,466కుపైగా కంపెనీలకు భూమి కేటాయించాం. రూ.11,548 కోట్ల కచ్చితమైన పెట్టుబడులు రానున్నాయి. రూ.24 వేల కోట్లకుపైగా పెట్టుబడితో నెలకొల్పే 39 భారీ, మెగా పరిశ్రమలతో 36,810 ఉద్యోగాలు లభించనున్నాయి.
► కాంట్రాక్టు పనుల్లో అవినీతికి తావు లేకుండా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తెచ్చి ఇప్పటికే రూ.2,200 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాం.

సమర్థంగా కరోనా కట్టడి
► కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఒకటి నుంచి 13కు పెంచి రోజుకు 15 వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా మరణాలు రేటు జాతీయ సగటు కంటే ఏపీలో తక్కువగా ఉంది.   

చరిత్రాత్మక శాసనాలు 
► ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 
► దేవదాయశాఖ పరిధిలోకి వచ్చే అన్ని పాలకమండళ్లలో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. 
► పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తూ చట్టం చేసింది. 
► రూ.100 కోట్లు దాటిన అన్ని టెండర్లను విశ్రాంత న్యాయమూర్తి ద్వారా పరిశీలించేందుకు జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. 
► మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని 21 రోజుల్లోనే విచారించి శిక్షించేందుకు దిశ బిల్లును తెచ్చింది. 18 దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 

దశలవారీగా మద్య నియంత్రణ...
► ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్‌ దుకాణాలను తొలగించింది. 4,300 పర్మిట్‌రూంల అనుమతులు రద్దు చేసింది. మద్య పానాన్ని నిరుత్సాహపరిచేందుకు విక్రయ వేళలు తగ్గిస్తూ ధరలను భారీగా పెంచింది. 

90 % హామీలు అమలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తమ దుస్థితిని, అవసరాలను ఆయన దృష్టికి తెచ్చారు. సంక్షేమ పథకాలను సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటికే తేవడం ద్వారా ప్రభుత్వం నూతన అధ్యాయానికి నాంది పలికింది. మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం. మేనిఫెస్టోలో లేని 40 నూతన హామీలను కూడాఅమలు చేశాం. ఈ ఏడాది వివిధ పథకాల కింద 3.98 కోట్లమందికి ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం రూ.42 వేల కోట్లు ఖర్చు చేసింది. 10.68 కోట్ల పని దినాలకు పైగా కల్పించి ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. అదనంగా 62 వేలకుపైగా కొత్త జాబ్‌ కార్డులిచ్చాం.  

అందరికీ సంక్షేమ ఫలాలు
► వైఎస్సార్‌ పింఛన్‌ కానుక ద్వారా 58.62 లక్షలమంది లబ్ధిదారులకు రూ.14,438 కోట్లు చెల్లించింది. 
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 91 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.1,400 కోట్లు అందించాం.
► వైఎస్సార్‌ వాహన మిత్ర పథకంతో రెండు దఫాలుగా రూ.500 కోట్లు చెల్లించాం. 
► అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.236.53 కోట్లు చెల్లించాం. 
► వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద రూ.211.70 కోట్లు పంపిణీ చేశాం. 
► నేతన్న నేస్తం కింద 81,703 మంది లబ్ధిదారులకు రూ.197కోట్లు పంపిణీ చేశాం. చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమల రీస్టార్ట్‌ ప్యాకేజీ, న్యాయనేస్తం పథకం కింద రూ.963 కోట్లు వెచ్చించాం. 

విద్యా వెలుగులు
► అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేల చొప్పున 42.33 లక్షల మంది తల్లుల ఖాతాలో రూ.6,350 కోట్లు జమ చేశారు. 
► జగనన్న విద్యాకానుక పథకంతో విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులు, షూలు, సాక్సులతో కూడిన కిట్లు ఇస్తున్నారు.  39,70,899 మంది విద్యార్థులకు కిట్ల కోసం రూ.656 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 
► జగనన్న గోరుముద్ద పథకంతో రూ.1,105.36 కోట్లు వెచ్చిస్తూ దాదాపు 39,70,899 మంది విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. 
► జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా 18.51 లక్షలమంది విద్యార్థులకు రూ.3,857 కోట్లు చెల్లిస్తున్నారు.
► జగనన్న విద్యా వసతి దీవెన పథకం కింద 15.57 లక్షలమంది హాస్టల్‌ విద్యార్థులకు రూ.1,221 కోట్లు చెల్లించారు. రెండు వాయిదాల్లో దాదాపు రూ.2,200 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా