అవినీతి లేని పాలనే లక్ష్యం

15 Jun, 2019 03:06 IST|Sakshi
శుక్రవారం చట్టసభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌

చట్టసభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌

లబ్ధిదారుల ఇళ్లకే సంక్షేమ పథకాల ప్రయోజనాలు

టెండర్లలో పారదర్శకతకు జ్యుడీషియల్‌ కమిషన్‌

ప్రజాధనం ఆదా కోసం రివర్స్‌ టెండరింగ్‌ విధానం

విభజన హామీల సాధనకు కేంద్రంపై నిరంతర ఒత్తిడి

రాష్ట్ర రైతు కమిషన్‌ ఏర్పాటుకు యోచన

నిర్ణీత గడువులోగా ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి

గత ఐదేళ్లలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు

సహజ వనరుల దుర్వినియోగంతో రాష్ట్రం అథోగతిపాలు

ఖాళీ ఖజానా ఉన్నా హామీల అమలుకు పక్కా ప్రణాళిక 

వ్యవస్థల ప్రక్షాళన ద్వారా దేశానికే ఆదర్శంగా రాష్ట్రం

సాక్షి, అమరావతి: పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడం.. నవరత్నాల సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుని ఇంటికి చేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వినూత్న విధానాలు అవలంభిస్తామని.. ఇవి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం ఖాళీ ఖజానాను తమకు అప్పగించినప్పటికీ దుబారాకు అడ్డుకట్ట వేసి ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం, వెలిగొండతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలితోపాటు కొత్తగా కొలువుదీరిన శాసనసభను ఉద్దేశించి శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా సూటిగా, స్పష్టంగా ఆయన ప్రసంగం కొనసాగింది. శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌.. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఓటువేశారని గవర్నర్‌ కితాబిచ్చారు. 

సమస్యల పరిష్కారంపై దృష్టి..
నరసింహన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘రాష్ట్ర విభజనవల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కాగా.. విభజనానంతరం ఏర్పడిన సవాళ్లను సక్రమంగా అధిగమించలేకపోవడంవల్ల మరికొన్ని చిక్కులు ఏర్పడ్డాయి. నూతన ప్రభుత్వానికి తక్షణమే ఈ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. నిధులు, సహజ వనరులు, మానవ వనరుల దుర్వినియోగంవల్ల రాష్ట్రం మరింత అథోగతిపాలైంది. దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున అన్ని రకాల వనరులను అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. సుపరిపాలన లక్ష్యంతో మంచి విధానాలు రూపొందించడంలో భాగస్వాములయ్యే సభ్యులందరికీ నేను మరోసారి స్వాగతం పలుకుతున్నాను. వారు ఈ రాష్ట్ర విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందిస్తారని విశ్వసిస్తున్నాను. గతంలో నిర్లక్ష్యానికి గురైన కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది’.. అని గవర్నర్‌ వివరించారు.

కేంద్ర సహకారానికి నిరంతర ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో పేర్కొన్న అంశాలు, ఇతర హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని గవర్నర్‌ అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ప్రారంభించామని.. వీటి విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందన్నారు. అలాగే, ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతుంది. ఇందుకోసం ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించడంతోపాటు లబ్ధిదారుల ఇంటికే సేవలు తీసుకెళ్లేందుకు సర్కారు చర్యలకు శ్రీకారం చుడుతుందని నరసింహన్‌ వివరించారు. 

పారదర్శకత, జవాబుదారీకి పెద్దపీట
గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మొట్టమొదట మా ప్రభుత్వం రద్దుచేయడం ఇందులో భాగమే. రెండో విషయానికి వస్తే.. టెండర్లు ఇవ్వడానికి ముందే ప్రతి టెండరును పరిశీలించేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ సహాయాన్ని నా ప్రభుత్వం కోరుతుంది. అవినీతికి పాల్పడే అవకాశం లేకుండా ఈ చర్య కట్టుదిట్టం చేస్తుంది. అలాగే, ప్రభుత్వ ధనం వృథా కాకుండా నివారించేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. థర్డ్‌ పార్టీ పరిశీలన తర్వాత అవసరమైతే రివర్స్‌ టెండరు విధానాన్ని చేపడుతుంది. ఖర్చును సమర్థంగా తగ్గించడానికి , అధిక ధర బిడ్డింగులను నివారించడానికి భవిష్యత్తులో ఈ విధానం దేశంలోనే ట్రెండ్‌ సెట్టరు కానుంది. 

నవరత్నాలతో అనేక వర్గాలకు లబ్ధి
పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషించాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావజాలం. దీనిని గతంలోకంటే బాగా అమలుచేసేందుకు ఈ సర్కారు కట్టుబడి ఉంది. ‘నవరత్నాలు’ రూపకల్పన ఇందులో భాగమే. వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, వైఎస్సార్‌ పింఛన్లు, పేదలందరికీ గృహాలు, యువతకు ఉపాథి–ఉద్యోగ కల్పన, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, దశల వారీగా మద్య నిషేధం, జలయజ్ఞం ఇందులోనివే. తొమ్మిది సంక్షేమ ఇతివృత్తాలు కలిగిన ఈ పథకం జనాభాలోని భిన్న వర్గాలకు, 
రంగాలకు లబ్ధి చేకూర్చుతుంది. 

రైతు సంక్షేమమే ప్రాథమిక బాధ్యత
రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. 62 శాతం జనాభా ఇంకా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున వారి ప్రయోజనాలు, సంక్షేమం చూడటం ప్రాథమిక బాధ్యతగా నా సర్కారు భావించింది. నకిలీ విత్తనాల సరఫరాతో సహా అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్న రైతుల గురించి  ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి సంస్కరణలు తీసుకురావడానికి రాష్ట్ర రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకంతో వ్యవసాయ పనులను అనుసంధానం చేయడమనేది నేటికీ అస్పష్టంగా ఉంది. సాగు ఖర్చులను తగ్గించడానికి.. సీజన్‌లో వ్యవసాయ కార్మికులు అందుబాటులో ఉండేటట్లు చూడటానికి వీలుగా ఈ విధానాన్ని రూపొందించడానికి గల సాధ్యాసాధ్యాలను కమిషన్‌ అన్వేషిస్తుంది. అలాగే, మొదట చెప్పిన దానికన్నా ముందే (2019 అక్టోబరు 15 నుంచి) ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా ద్వారా సాలుకు రూ.12,500లు ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇది రైతులకు నేరుగా రూ.10 వేల కోట్లకుపైగా నిధులు అందించేందుకు వీలు కల్పిస్తుంది. కౌలు రైతులకు కూడా సాయం అందుతుంది. సాగుదారులు, భూయజమానుల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలుగకుండా కౌలు రైతుల ప్రయోజనాలు కాపాడాలని సర్కార్‌ నిర్ణయించింది. 
అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి
కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హుల్లో చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనేదే సర్కారు మూడో ప్రాధాన్యం. ఇందులో భాగంగానే లబ్ధిదారుల ఇళ్లకే సంక్షేమ ఫలాలతోపాటు అన్ని సేవలు చేర్చడానికి గ్రామ సేవకుడు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీరు, పట్టణాల్లో అయితే ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి అన్ని పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరేలా చేస్తుంది. వలంటీర్‌కు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తుంది. అంతేకాదు.. గ్రామ సచివాలయ పాలన అందుబాటులోకి వచ్చిన తర్వాత పౌరులిచ్చే ప్రతి అభ్యర్థన 72 గంటల్లో పరిష్కరించే వ్యవస్థ ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర పత్రంగా పరిగణించి అమలుచేసేందుకు నా సర్కారు బాధ్యత వహిస్తుంది. ఎలాంటి మార్పు లేకుండా ప్రతి వాగ్దానం అమలుచేస్తుంది.

అమల్లోకొచ్చిన.. కొత్త సర్కారు తీసుకోనున్న కీలక నిర్ణయాలివే..
- రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు ఉచితంగా బోర్లు వేయిస్తుంది. 
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించనుంది. 
రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు. 
సహకార డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తుంది. 
ఏదేని కారణంవల్ల రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.7 లక్షలు అందిస్తుంది. 
ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబానికి రూ. వెయ్యికి మించిన వైద్యం అవసరమైతే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం. ఈ పథకం కింద ప్రస్తుతమున్న 1095 వ్యాధులకు మరో 936 చేరుస్తాం.
దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే రోగలకు ప్రత్యేక సాయంగా నెలకు రూ.10 వేల పింఛను.
వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీని సమర్థంగా అమలుపర్చడంతోపాటు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక.
గ్రామ ఆరోగ్య కార్యకర్తల నెలసరి గౌరవ వేతనాన్ని రూ.3,000 నుంచి రూ. 10,000కు పెంపు.
దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మొదటి దశలో బెల్ట్‌షాపులను మూసివేతకు నిర్ణయం. 
పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ.15,000లు చెల్లింపు.
సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడంతోపాటు ప్రతి విద్యార్థికి వసతి కోసం ఏటా రూ. 20,000 మంజూరు
‘వైఎస్సార్‌ చేయూత’ కింద రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో మహిళల ఆర్థిక ప్రగతి కోసం 45–60 ఏళ్ల మధ్య వయసుగల వారికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో 
రూ.75,000 చెల్లింపు.
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బలహీన వర్గాల నూతన వధువులకు వివాహ సమయంలో రూ. లక్ష ప్రోత్సాహకంగా అందిస్తాం. 
ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాజకీయపరంగా నియమించే డైరెక్టర్లు, చైర్మన్లు, పాలక మండళ్లు తదితర నియామకాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తాం. 
కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రణాళిక రూపొందించాం. అలాగే, ఆర్య వైశ్యులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిపట్ల తగు శ్రద్ధ చూపుతాం. 
సామాజిక పింఛన్‌ను దశల వారీగా రూ.3,000కు పెంచుతామన్న హామీ మేరకు వైఎస్సార్‌ భరోసా పింఛను రూ.2,250కి పెంచాం. నాలుగేళ్లలో దీనిని రూ.3,000కు తీసుకెళ్తాం. అలాగే, పింఛనుకు అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. దీనివల్ల 5 లక్షల మందికి అదనంగా ప్రయోజనం కలిగింది.
2020 ఉగాది నుంచి 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అలాగే, వచ్చే నాలుగేళ్లపాటు ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీ ఏర్పాటు చేశాం.
పురపాలక పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.12,000 నుంచి రూ. 18,000కు పెంచాం. 
ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) 27 శాతం జూలై నుంచి చెల్లిస్తాం. 
గిరిజన సంక్షేమ శాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.400 నుంచి రూ.4,000కు పెంచాం. అంగన్‌వాడీలు, హోంగార్డులకు వేతనాలు పెంచాం. 
అక్రమ మైనింగ్, అవినీతి నిరోధానికి కొత్త ఇసుక విధానం తెస్తాం.  

మరిన్ని వార్తలు