నేడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

14 Jun, 2019 04:32 IST|Sakshi

సాక్షి, అమరావతి, విజయవాడ / గన్నవరం: కొత్తగా కొలువు తీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్‌ ప్రసంగం ఉండనుంది. నెల తిరక్కముందే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 60 శాతంపై విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్న విషయాన్ని గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.

మేనిఫెస్టోలోని నవరత్నాలు అమలుతోనే ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగుల గురించి, అవినీతి రహిత.. పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్‌ ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైనదనే విషయాన్ని కూడా గవర్నర్‌ ప్రసంగంలో స్పష్టం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ విధానాలను, లక్ష్యాలను గవర్నర్‌ తన ప్రసంగం ద్వారా వివరించనున్నారు. ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యాక సభ వాయిదా పడుతుంది. శనివారం, ఆదివారం సభకు సెలవు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమ, మంగళవారాల్లో చర్చ అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ సమాధానం ఉంటుంది.

విజయవాడకు చేరుకున్న గవర్నర్‌
ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు గురువారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 2.25 గంటలకు గన్నవరం చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్‌ కార్యదర్శి ఆర్‌పీ.సిసోడియా, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ.ఇంతియాజ్, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గవర్నర్‌ విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఈవో వి.కోటేశ్వరమ్మ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కాగా, విజయవాడలో గవర్నర్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.  

మరిన్ని వార్తలు