గ్లోబరీనా ‘గోల్‌మాల్’పై ఆరా?

13 May, 2015 02:11 IST|Sakshi

జేఎన్‌టీయూకే
     వీసీతో గవర్నర్ ప్రత్యేక భేటీ
     రూ.100 కోట్ల
     ఆ ఒప్పందంపైనే ప్రధాన చర్చ!
     దీనిపై గతంలోనే
     గవర్నర్‌కు సీపీఐ నేతల ఫిర్యాదు
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :
 రాష్ట్ర గవర్నర్ ఎస్‌ఎల్ నరసింహన్‌తో జేఎన్‌టీయూ కాకినాడ వైస్ చాన్సలర్ వీఎస్‌ఎస్ కుమార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ రెండు రోజుల జిల్లా పర్యటన మంగళవారంతో ముగిసింది. తొలిరోజు సోమవారం రాజమండ్రిలో పుష్కర ఘాట్లను పరిశీలించి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ కాకినాడలో డాక్టర్ ఎస్‌వీఎస్ రావు కుమారుడి వివాహానికి హాజరయ్యూరు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో బసచేశారు.
 
 కాగా మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో జేఎన్‌టీయూకే వీసీ వీఎస్‌ఎస్ కుమార్ ఒక్కరే ఒక ఫైల్ పట్టుకుని వడివడిగా ఆర్‌అండ్‌బి అతిథిగృహంలోకి వెళ్లారు. అలా వెళ్లిన వీసీ సుమారు అరగంట పాటు చాన్సలర్, గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆ అరగంట చాన్సలర్, వైస్ చాన్సలర్‌ల మధ్య ఏం జరిగిందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరి మధ్య ఏకాంతంగా  సాగిన ఆ అరగంట భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై వర్సిటీ వర్గాలు ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. గత వీసీ తులసీరామ్‌దాస్ హయాంలో గ్లోబరినాతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సుమారు రూ.100 కోట్ల ఈ ఒప్పందంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఒప్పందంలో అవకతవకలు జరిగాయని గతంలో జిల్లా నుంచి సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ, ఇటీవల సీపీఐ రాష్ట్ర నేత నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
 
  ఈ నేపథ్యంలో ప్రస్తుత వీసీ వీఎస్‌ఎస్ కుమార్ గవర్నర్‌తో సమావేశం కావడంతో సహజంగానే ఈ అంశం చర్చకు వచ్చిందని వర్సిటీ వర్గాలు అంటున్నాయి. ఆ ఒప్పందం వల్ల పరీక్షల ఫలితాలు సకాలంలో విడుదల కాక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనే వీసీ, గవర్నర్లు ప్రధానంగా చర్చించినట్టు భావిస్తున్నారు. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి అనే దానిపై గవర్నర్ ఆరా తీశారని తెలుస్తోంది. ఫిర్యాదులు వస్తున్నట్టుగా రూ.100 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న దానిలో వాస్తవమెంత,  ఒప్పందానికి ముందు ఫలితాల విడుదలకు ఎంత సమయం పట్టేది, ఒప్పందం తరువాత ఎంత కాలం పడుతోంది, ఇందుకు కారణాలు ఏమిటి అన్నది గవర్నర్  వీసీని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన గవర్నర్ దీనిపై సమగ్ర సమాచారాన్ని కోరారని తెలుస్తోంది.
 
 పోస్టుల భర్తీపై సానుకూల స్పందన
 అలాగే వర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల విషయంలో ఇంతవరకు తీసుకున్న చర్యలు, పంపిన ప్రతిపాదనలపై కూడా చర్చ జరిగిందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పోస్టుల భర్తీ విషయంలో గవర్నర్ సానుకూలంగా స్పందించారంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం జేఎన్‌టీయూకే తొలిసారి నిర్వహించిన ఎంసెట్‌పై కూడా  గవర్నర్ ఆరా తీశారు. ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఆర్టీసీ సమ్మె ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. మొత్తం మీద గవర్నర్ పర్యటనతో వర్సిటీకి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని వర్సిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గవర్నర్‌తో భేటీ విషయమై వీసీ వీఎస్‌ఎస్ కుమార్‌ను ‘సాక్షి’ సంప్రదించగా మర్యాదపూర్వకంగా జరిగిందని, ఎంసెట్ నిర్వహణపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసి ఎంసెట్ టీమ్‌కు అభినందనలు తెలియచేశారన్నారు. ఇతర విషయాలపై స్పందించ లేదు.
 
 గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు
 కోరుకొండ : జిల్లా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వెళ్లిన గవర్నర్ నరసింహన్ దంపతులకు మధురపూడి విమానాశ్రయంలో పలువురు ఘనంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం  2.30 గంటలకు స్పైస్‌జెట్‌లో గవర్నర్ దంపతులు హైదరాబాద్ పయనమయ్యారు. వీడ్కోలు పలికిన వారిలో రాజమండ్రి సబ్‌కలెక్టర్ వి.విజయరామరాజు, రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ, అడిషనల్ ఎస్పీలు సిద్ధారెడ్డి, బి.శరత్‌బాబు, కోరుకొండ ఉత్తర మండల డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, సీఐ ఎన్.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు ఎస్సై ఎం. కనకరావు తదితరులు ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు