కాలుష్యంతో మానవాళికి ముప్పు

21 Oct, 2019 04:38 IST|Sakshi

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

సాక్షి, విశాఖపట్నం: పెరుగుతున్న కాలుష్యం మొత్తం మానవాళిని నాశనం చేస్తోందనీ.. దానిపై యుద్ధం చెయ్యాల్సిన తరుణం ఆసన్నమైందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించేందుకు నడుం బిగించాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన భారత పెట్రోలియం, ఎనర్జీ సంస్థ(ఐఐపీఏ) నాలుగో వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఏకైక లక్ష్యం కాలుష్యమని వ్యాఖ్యానించారు.

ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులు, పరిణామాల్ని అధ్యయనం చేసి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం సహాయంతో యువ శాస్త్రవేత్తల్ని తయారు చెయ్యగలమని ఆయన ఆకాంక్షించారు.  ఐఐపీఏ న్యూస్‌ లెటర్‌ని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అంతకుముందు ఏయూ ఆవరణలో గవర్నర్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, కలెక్టర్‌ వినయ్‌ చంద్, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా, ఐఐపీఏ డైరెక్టర్‌ ప్రొ.వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా అమరవీరుల సంస్మరణార్థం సాగరతీరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో గవర్నర్, మంత్రి ముత్తంశెట్టి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు