గోవిందరాజ స్వామి కిరీటాల దొంగ పట్టివేత

8 Apr, 2019 16:54 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో ఫిబ్రవరి 3న గోవిందరాజస్వామి గుడిలోని ఉత్సవ విగ్రహాలపై ఉన్న కిరీటాలను దొంగలించిన వ్యక్తులను ఎట్టకేలకు తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవమూర్తిపై ఉన్న విగ్రహాలు, కిరీటాలను దొంగిలించినట్లు టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఇప్పటికే నిందితుడి ఛాయాచిత్రాన్ని విడుదల చేశారు. దీనిపై 6 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపులు చేపట్టారు. పోలీసులు విడుదల చేసిన నిందితుడు మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని హనుమాన్‌ మందిర్‌ జావాల్‌ ఖాదర్‌ ప్రాంతానికి చెందిన ఆఖాష్‌ ప్రతాప్‌గా గుర్తించారు.

నిందితుడిని దాదార్‌ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిందితుడి కోసం పోలీసులు అతని ఇంటి వద్ద వేచిచూసి పక్కా రెక్కీతో పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ముంబైలో రూ.2 లక్షల కోసం కిరీటాలను కుదవపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఇది వరకు పోలీసులు ముంబైకి చేరుకుని వాటిని సంబంధిత వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు ఇంత వరకు స్పందించలేదు. కేవలం అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు. కిరీటీల స్వాధీనంపై స్పష్టత ఇవ్వడం లేదు. దాదాపు 2 నెలలకుపైగా ఉత్కంఠరేపిన కిరీటాల కేసు ఎట్టకేలకు పోలీసులు చేధించడంతో భక్తులు సంతోషం నెలకొంది. ఈ చోరీకి పాల్పడిన నిందితుడు ఆకాష్‌ప్రసాద్‌ ఇలాంటి నేరాలకే పాల్పడేటట్లుగా ఆ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లుగా గుర్తించారు. అందుకనే సరైన భద్రత లేని గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు