అశోక్‌బాబుకు నిరసన సెగ!

11 Aug, 2018 12:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని (సీపీఎస్‌) రద్దు చేయాలంటూ విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు శనివారం చేపట్టిన ధర్నాలో ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబుకు చుక్కెదురైంది. జింఖానా మైదానంలో కొనసాగుతున్న ఉద్యోగుల సభకు ఆయన హాజరుకావడంపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అశోక్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించడాన్ని అడ్డుకున్నారు. ఉద్యమాన్ని చీల్చే ఇలాంటి నేతలను పిలవొద్దంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అశోక్‌ బాబు వెంటనే వేదికపైనుంచి దిగిపోవాలని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సీపీఎస్‌ రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంతో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలలనుంచి వచ్చిన వేలాదిమంది ప్రతినిధులు.. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు