తెరపైకి ఓర్వకల్లు విమానాశ్రయం

9 Jul, 2016 12:15 IST|Sakshi

 రెండు రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం
 నెలాఖరుకు భూమి అప్పగించాలని
 జిల్లా అధికారులకు ఆదేశాలు
 బీఐఏసీఎల్‌కు నిర్మాణ బాధ్యతలు
 ఏడాదికి సుమారు 80వేల మంది ప్రయాణిస్తారని అంచనా

 
కర్నూలు: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్లు తెలిసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెండర్ దాఖలైన వెంటనే భూ సేకరణ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. ఈ నెలాఖరు నాటికి విమానాశ్రయ ఏర్పాటుకు మొత్తం భూమిని అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 1,110 ఎకరాల విస్తీర్ణంలో రూ.234 కోట్లతో ఈ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇందులో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమి కూడా ఉంది. అయితే, తమ భూముల్లో మైనింగ్ నిల్వలు ఉన్నందున భూములివ్వమని మొదట్లో రైతులు వ్యతిరేకించారు. ఆ తర్వాత అధికారుల చర్చల నేపథ్యంలో అంగీకారం లభించింది. విమానాశ్రయ ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కంపెనీ(బీఐఏసీఎల్)కు అప్పగించింది.

ఇదీ ప్రయాణికుల లెక్క..
ఓర్వకల్లు ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పడిన తర్వాత ఎంత మేరకు ప్రయాణికులు ప్రయాణిస్తారనే విషయంలో ఇప్పటికే మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు ఒక అంచనా రూపొందించారు. ఏడాదికి సుమారు 80 వేల మందికిపైగా విమానయానం చేస్తారని అంచనా వేశారు. అయితే, ఈ సంఖ్య కాస్తా 2020 నాటికి లక్షా 40 వేల మందికి చేరుకుంటుందని భావిస్తున్నారు. 2030 నాటికి 4 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తారని అంచనా వేశారు. అదేవిధంగా కార్గో(సరుకు రవా ణా) కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.

నెరవేరనున్న వైఎస్ కల
వాస్తవానికి ఓర్వకల్లు ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనేది దివంగత నేత వైఎస్‌ఆర్ స్వప్నం. ఇందుకోసం 2008లోనే ఆయన సీఎంగా ఉన్న సమయంలో టెండర్లు కూడా పిలిచారు. అయితే, ఇక్కడ నుంచి విమానం ఎక్కే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుందని.. అందువల్ల మరిన్ని రాయితీలు కావాలని బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలు కోరాయి. ఈ నేపథ్యంలో 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి టెండర్లు పిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇంతలోనే ప్రమాదం జరిగి ఆయన మరణించారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ కాస్తా మూలకు చేరింది. తాజాగా మరోసారి ఓర్వకల్లు విమానాశ్రయం తెరమీదకు వచ్చింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా