ప్రభుత్వాసుపత్రి స్థలంపై.. ‘పచ్చ’గద్దలు!

7 Nov, 2015 02:26 IST|Sakshi

ఎక్కడైనా కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు..శవాన్ని పీక్కుని తినే రాబందుల్లా.. ‘పచ్చ’గద్దలు వాలిపోతున్నాయి. ప్రజాప్రయోజనాలను ఆశించి జిల్లాలోని పలుచోట్ల దాతలు ఇచ్చిన స్థలాలకు..
 వాటి పుణ్యమా అని రక్షణ కరువవుతోంది. కంచే చేను మేసిన చందంగా రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే.. అధికార బలంతో వాటిని తన్నుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు. చట్టంలో లొసుగులను ఆసరా చేసుకొనో.. లేదంటే తమకు అనుగుణంగా నిబంధనలు మార్పించుకునో.. కన్నేసిన స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ/తుని :పిఠాపురం పట్టణంలో క్రిస్టియన్ ఆసుపత్రి స్థలం కబ్జా యత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చి వారం రోజులు తిరగకముందే.. మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత ఆశయంతో ఎప్పుడో వందేళ్ల కిందట తుని సంస్థానానికి చెందిన రాణి సుభద్రయమ్మ.. తుని పట్టణం నడిబొడ్డున రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలోని పోస్టాఫీసు వీధిలో సుమారు ఎకరా స్థలం దానంగా ఇచ్చారు. అక్కడ ఆసుపత్రి నిర్మించారు. తుని నియోజకవర్గంలో తొలి ప్రభుత్వాసుపత్రి ఇదే. రోజుకు సగటున 400 నుంచి 500 మంది వరకూ ఇక్కడ వైద్య సేవలు పొందేవారు. కొన్నేళ్ల క్రితం సూరవరం రోడ్డులో ఘోషాసుపత్రి ఏర్పాటు చేయడంతో.. పోస్టాఫీసు వీధిలోని ఈ ఆసుపత్రిని పురుషులకోసం ప్రత్యేకంగా కేటాయించారు. 15 ఏళ్ల క్రితం ఘోషాస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చడంతో ఈ పురుషుల ఆస్పత్రిని తాత్కాలికంగా మూసేశారు.
 
 కబ్జాదారుల కన్ను
 ప్రస్తుతం తుని పట్టణంలోని పాతపోస్టాఫీసు వీధిలో చదరపు గజం స్థలం విలువ రూ.60 వేల వరకూ ఉంది. అనధికార లెక్కల ప్రకారం చూసినా ఈ ఆసుపత్రి స్థలం విలువ కనిష్టంగా రూ.18 కోట్ల పైమాటే. అంత విలువైనది కాబట్టే దీనిని ఆక్రమించుకోవడానికి ఒకటిన్నర దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి బీజం వేసింది కూడా టీడీపీ నాయకులే. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కీలక నేత ఒకరు ఈ స్థలాన్ని ఆక్రమించుకుని, సొంత వ్యాపార అవసరాల నిర్వహణకు వాడుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక ముఖ్య నేత ఒకరు ఆసుపత్రి స్థలాన్ని ఆక్రమించారు. అక్కడి నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించారు. ఆసుపత్రి సముదాయంలోని మూడు పెంకుటిళ్లను పాతసంచుల మరమ్మతులకు వినియోగించేవారు. అసలు ఆసుపత్రి స్థలంలో ఎటువంటి అనుమతులూ లేకుండానే షాపు నిర్మించి, దానిని ఓ వ్యాపారికి అద్దెకు ఇచ్చారు. దీనికి నెలకు రూ.30 వేల చొప్పున పదేళ్ల పాటు అద్దె వసూలు చేసుకున్నారు.
 
 బలవంతంగా ఖాళీ చేయించి..
 ఈ వ్యవహారాన్ని పదేళ్లపాటు చూస్తూ ఏమీ చేయలేక కూర్చున్న స్థానిక టీడీపీ నేత.. ఏడాదిన్నర క్రితం టీడీపీ అధికారంలోకి రాగానే రెచ్చిపోయారు. దందాల్లో ఆరితేరిన ఆయనకు కాంగ్రెస్ నేతను ఖాళీ చేయించడం పెద్ద కష్టం కాలేదు. యథాప్రకారం పోలీసుల సహకారంతో పని పూర్తి చేయించారు. గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరే ఇబ్బందీ తలెత్తకుండా ఆ స్థలాన్ని సొంతం చేసుకోవడానికి ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు.
 
 రెవెన్యూ రికార్డులు తిరగరాసేందుకు..
 పట్టాదారు పాసు పుస్తకంలో చిన్న తప్పు దొర్లితే చాలు.. దానిని సరిదిద్దడానికి సామాన్య రైతులను రెవెన్యూ అధికారులు నిబంధనల పేరుతో రోజుల తరబడి తిప్పుతారు. అటువంటివారిలో కొందరు అధికార పార్టీ నేతలకు మాత్రం దాసులైపోతున్నారు. ‘లేదంటే దూరప్రాంతానికి బదిలీ చేయించేస్తా’ అని హుంకరిస్తున్న ఆ టీడీపీ నాయకుడి బెదిరింపులకు భయపడి.. చెప్పిందానికల్లా తలాడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామకంఠం స్థలాలను లీజు విధానంలో పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకోవడానికి టీడీపీ నాయకుడు పావులు కదుపుతున్నారు. ఆసుపత్రి స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా చూపించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా దానిని 33 ఏళ్లపాటు లీజు రూపంలో కైంకర్యం చేయడానికి రెవెన్యూ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం.
 
 ప్రజావసరాలకే వినియోగించాలి..
 ప్రజాప్రయోజనాలకోసం తుని సంస్థానాధీశులు ఆ స్థలాన్ని ఆసుపత్రికి కేటాయించారు. ఆ స్థలాన్ని ఎప్పటికైనా ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. వాణిజ్య అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని నాటి రాణిగారి వీలునామాలో ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనా ఆసుపత్రి స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తే మేం ఆందోళనకు దిగుతాం.
 - దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని
 

>
మరిన్ని వార్తలు