గ్యాస్ రాయితీ వదిలించండి!

23 Jun, 2015 03:33 IST|Sakshi
గ్యాస్ రాయితీ వదిలించండి!

సాక్షి, హైదరాబాద్: దేశంలోని పేదలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి సబ్సిడీ సిలిండర్లు అందించేందుకు వీలుగా... సంపన్న వర్గాలు పొందుతున్న గ్యాస్ రాయితీని వదిలించుకొనేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఏటా రాయితీ సిలిండర్ల ద్వారా ఒక్కో కనెక్షన్‌పై దాదాపు రూ.6వేల వరకు సబ్సిడీ భారం పడుతోందని, సంపన్న వర్గాలు దీన్ని వదులుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తోంది.

ప్రజా ప్రతినిధులు, ఉన్నతోద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఆర్థికంగా ఉన్నవారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకునేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ కంపెనీలు, పౌర సరఫరాల శాఖపై ఒత్తిడి తెస్తోంది.  తాజాగా ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది.
 
విస్తృతంగా ప్రచారం: కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయిల్ కంపెనీలు.. ‘గివ్ ఇట్ అప్’ పేరుతో ప్రచారం మొదలెట్టాయి. మొబైల్ యాప్, ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఎస్సెమ్మెస్ ద్వారా అయితే... ‘గీవ్ ఇట్ అప్’ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి భారత్‌గ్యాస్ వినియోగదారులు 773829899కు, హెచ్‌పీ గ్యాస్ అయితే 9766899899కు, ఇండియన్ గ్యాస్ అయితే 8130792899కు పంపి రాయితీని వదులుకోవచ్చు. హెచ్‌పీ, భారత్, ఇండియన్ గ్యాస్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా, లేదా డిస్ట్రిబ్యూటర్ల వద్ద దరఖాస్తు చేసుకుని సబ్సిడీని వదులుకునే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీల రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్ తెలిపారు.
 
వదులుకున్నది 17వేల మంది
ఇప్పటికే కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, ప్రముఖులు గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారు. ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న సమాచారం మేరకు తెలంగాణలో 10,347, ఆంధ్రప్రదేశ్‌లో 6,617 మంది కలిపి 16,964 మంది రాయితీని వదులకున్నారు. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 3,194 మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో మరో 2,566 మంది ఉన్నారు.

రాయితీని వదులుకున్న వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ, ఏపీ మంత్రులు ఈటల రాజేందర్, పరిటాల సునీత, ఎంపీలు కవిత, కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పార్వతమ్మ, ఐఏఎస్‌లు కె.పున్నయ్య, రతన్‌ప్రకాశ్, పింగళి రామకృష్ణారావుతో పాటు ఇతర ప్రముఖుల్లో వైఎస్ భారతి, రామోజీరావు, వి.చాముండేశ్వరినాథ్ తదితరులు ఉన్నారు. వీరి తరహాలో మరింత మంది ముందుకు రావాలని ఆయిల్ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి.

>
మరిన్ని వార్తలు