చెరుకు రైతుపై చిరుకన్ను!

1 Dec, 2018 14:42 IST|Sakshi

ప్రోత్సాహం కరువు జిల్లా అంతటికీ ఫ్యారిస్‌ కర్మాగారమే దిక్కు

సాగుకు ముందుకు రాని రైతులు..మద్దతు ధరపై మీనమేషాలు  

చెరుకు సాగును టీడీపీ సర్కారు చిన్నచూపు చూస్తోంది. రైతన్నకు పంట సాగుపై ఆసక్తి ఉన్నా సర్కార్‌ మాత్రం సహకరించడం లేదు. సరైన   మద్దతు ధర లేకపోవడం, ప్రోత్సాహం ఉండకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా సాగు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

రాజాం/రేగిడి: జిల్లాలో చెరుకు సాగు ఏటా పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం మిగిలిన పంటలు కలిసి రాకపోవడమే. దీంతో ఎక్కువ మంది రైతులు చెరుకు సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పంటను సాగుచేస్తే ప్రతికూల పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చునని భావిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 18,300 ఎకరాల్లో చెరకు పంటను సాగు చేశారు. అయితే సరైన మద్దతు ధరలేక అవస్థలు పడుతున్నారు. 

ఒకటే  ఫ్యాక్టరీ 
చెరుకు సాగు విస్తీర్ణం పెరుగుతున్నా చక్కెర పరిశ్రమ మా త్రం జిల్లాలో ఒకటే ఉంది. రేగిడి మండలంలోని సంకిలి ఫ్యారిస్‌ ప్రైవేటు చక్కెర కర్మాగారం ఒక్కటి మాత్రమే గత్యంతరంగా మారింది. ఆమదాలవలసలోని చక్కెర కర్మాగారం 2003లో మూత బడింది. దీంతో జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా చెరకు సాగు తగ్గిపోయింది. తరువాత సంకిలి  ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో రైతులు మళ్లీ సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే ప్రభుత్వ మద్దతు ధర కల్పించడం లేదు. చెరుకు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. ఫలితంగా రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం ఫ్యారిస్‌ చక్కెర కర్మాగారం పరిధిలోని పలు మండలాల్లో ఈ ఏడాది 18 వేల ఎకరాల్లోనే చెరుకు పంటను సాగు చేస్తున్నారు. పరిశ్రమవారి నిబంధల మేరకు చెరుకు సాగు చేసే వారికి ఎకరాకు రు.7 వేల రాయితీని, సాధారణ సాగుకు రూ. 5 వేల రాయితీని యాజమాన్యం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కర్మాగార సిబ్బంది దీన్ని విస్తారంగా ప్రచారం చేసినప్పటికీ రైతుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు   
శ్రమకు తగ్గ ఫలితం శూన్యం..
చెరుకు సాగు రైతుకు ఆదాయపరంగా పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర ప్రతి ఏటా టన్నుకు రు.50 నుంచి వంద రూపాయల లోపే పెరుగుతుండగా, సాగు ఖర్చులు మాత్రం భారీగా ఉంటున్నాయి. చెరుకు టన్ను ధర ప్రస్తుతం 2750 మాత్రమే ఉంది. దీంతో ఇది ఏమాత్రం సరిపోవడం లేదని  రైతులు, రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. టన్నుకు రు.4000 చెల్లిస్తే గిట్టుబాటు అవుతోందంటున్నారు. అయితే సర్కార్‌ మాత్రం రైతుల డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది పెంచిన మద్దతుధరే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. ఎకరా చెరుకు పంట సాగు చేయాలంటే దుక్కి, విత్తనం, గొప్పు, కలుపు తీత, చెరుకు నరకడం, రవాణా ఇతర యాజమాన్య ఖర్చులు కలిపి సుమారు రు.50 వేలు వరకు ఖర్చు అవుతుంది. ఎకరాకు సరాసరిన 25 టన్నులు మాత్రమే దిగుబడి వస్తోంది. ఈ లెక్కన చూస్తే రు.67,500 రైతుకు కర్మాగారం చెల్లిస్తోంది. ఖర్చులు పోను రైతుకు మిగిలేది రు.17,500 మాత్రమే. ఈ లెక్కన చూస్తే ఏడాది పొడుగునా చెరుకు పంట పొలంలో ఉండటంతో అపరాలు పంటను కూడా వేసుకోలేకపోవడంతో రైతు నష్టపోతున్నారు.
 
పెరగని దిగుబడులు 
 జిల్లాలో చెరుకు పంట దిగుబడులు చూసుకొంటే సగటున ఎకరాకు 30 టన్నులు మించడం లేదు. సాంకేతిక యాంత్రీకరణ పద్ధతులను రైతులకు అందించడంలో సైతం వ్యవసాయాదికారులు వెనకబడి ఉన్నారు.  ప్రస్తుతం చెరుకు పంట దిగుబడిని పెంచేందుకు ఫ్యారిస్‌ చక్కెర కర్మాగారం యాజమాన్యం కృషి చేస్తోంది. మొక్కకు..మొక్కకు నాలుగు అడుగుల దూరం ఉండేలా చూడడం, యాంత్రీకరణ పద్ధతులను కూడా తెరపైకి తెచ్చినప్పటికీ దిగుబడి మాత్రం పెరగడం లేదు. దీంతో రైతుల శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోయింది. సర్కార్‌ ప్రోత్సాహం చెరుకు రైతుకు లేకుండా పోయింది.

గిట్టుబాటు కావడం లేదు 
చెరుకు సాగు చేద్దామని ఆశపడిన ప్రయోజనం ఉండడం లేదు. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. రాబడి తక్కువుగా ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన, ప్రోత్సాహం పూర్తిగా లేదు. చల్లా రాజరత్నంనాయుడు, రైతు,వండానపేట, రేగిడి మండలం

 ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది 
మార్కెట్‌లో అమ్మిన పంచదారకు ధర ఎక్కువుగా ఉంది. రైతు పండించిన చెరకు పంటకు ధర ఉండటంలేదు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు అయ్యేలా  టన్నుకు రూ. 4000 ధరను అందజేయాలి.  -కరణం గోవిందరావు, రైతు, ఉప్పర్నాయుడువలస, రేగిడి మండలం   

మరిన్ని వార్తలు