కట్టుకోమన్నారు.. కనికరించడం లేదు

15 Feb, 2014 02:55 IST|Sakshi
కట్టుకోమన్నారు.. కనికరించడం లేదు

 కట్టుకోమన్నారు.. కనికరించడం లేదు
 ఉండి,  :
 ఉండి మండలంలోని వాండ్రం గ్రామ శివారు ప్రాంతమైన వాండ్రం లంకలో 30 కుటుంబాలు నివాసం ఉంటున్నారుు. వీరంతా పేదలు. వీరు 11 వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకొని సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. అప్పట్లో మరుగు దొడ్లు నిర్మించుకోలేదనే కారణంతో పంచాయతీ అధికారులు 4 నెలలపాటు రేషన్ సరుకులను ఇవ్వలేదు. మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే ఇస్తామని చెప్పారు. దీంతో దిక్కుతోచని పేదలు అప్పో సప్పో చేసి దొడ్ల నిర్మాణం చేపట్టారు. ఎలాగోలా నానా తంటాలు పడి వాటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా వీరికి ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. వీరిని పలకరించిన అధికారిగానీ, ప్రజా ప్రతినిధిగానీ లేరు. దీనిపై ఎన్నిసార్లు పంచాయతీ అధికారికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని వారు వాపోతున్నారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో వీటిని ఉపయోగించుకునే అవకాశం లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బహిర్భూమికి వెళ్లాలంటే చుట్టూ అడవిలాంటి ప్రదేశం ఉన్న ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ విష సర్పాలు, పురుగుల సంచారం ఎక్కువ. మరోపక్క రైల్వే ట్రాక్ ఉంది. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం వాటిల్లుతుందోనని వారు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు