డెంగీ భయం !

26 Sep, 2014 02:20 IST|Sakshi
డెంగీ భయం !

జిల్లాలో ‘డెంగీ’ వ్యాధి పొంచి ఉందా...రెండేళ్ల కిందట వణికించిన ఈ మహమ్మారి తిరిగి జిల్లాలో కోరలు చాచనుందా....ప్రస్తుతం ఊరూరా ప్రబలిన జ్వరాలన్నీ డెంగీ ఛాయలేనా...గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే విషజ్వరాలు దూకుడుగా వ్యవహరిస్తాయా ... రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోతే ప్రాణాలకు ముప్పేనా...ఇవీ ప్రస్తుతం జిల్లాలోని రోగుల్లో తలెత్తుతున్న అనుమానాలు, భయాందోళనలు. పల్లెలు, పట్టణాల్లో జ్వరాలు అదుపులోకి రాకపోవడంతో రోగులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. వైద్యులు సైతం అవి సాధారణ జ్వరాలా, లేక డెంగీ జ్వరాలా అనేది తేల్చలేకపోతున్నారు.
 
- జిల్లాను వణికిస్తున్న జ్వరాలు
- పట్టణాల్లో కిక్కిరిసిన ఆసుపత్రులు
- ధనార్జనే ధ్యేయంగా రోగులను పిండేస్తున్న వైద్యులు
- నిమ్మకు నీరెత్తినట్టుగా వైద్య ఆరోగ్య శాఖాధికారులు
- గ్రామాల్లో కొరవడిన పారిశుద్ధ్యం
 సాక్షి, గుంటూరు: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. అధిక శాతం మందికి రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోతుండటంతో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. వారికి డెంగీ ఉందా లేదా అనే విషయం మాత్రం వైద్యులు చెప్పలేకపోతు న్నారు. ప్రజలు డెంగీ జ్వరాలపై భయాందోళనకు గురి కాకుండా సరైన వైద్యులను ఆశ్రయించి చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఫిజీషియన్లు సలహా ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా పది డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
గ్రామాల్లో కొరవడిన పారిశుద్ధ్యం
►గ్రామాల్లో పారిశుద్ధ్యం కొరవడి జ్వరాలు వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా ఓ కారణం గా వైద్యులు చెపుతున్నారు.
►గ్రామాల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్త, చెదారం లేకుండా చూడడం, మురుగు నీరు నిల్వలేకుండా చూడాలని వైద్యులు సూచన చేస్తున్నారు. లేని పక్షంలో జ్వరాల బా రిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.
 
నివారణ చర్యలపై దృష్టి పెట్టని వైద్య ఆరోగ్య శాఖ...

►వర్షాకాలం జ్వరాల సీజన్ అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
►గ్రామాల్లో ఏఎన్‌ఎంల ద్వారా జ్వర పీడితుల రక్త సేకరణ జరిపి వారికి ఎలాంటి జ్వరం వచ్చింది, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలనే వాటిపై దృష్టి సారించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏమీ పట్టనట్లు కూర్చున్నారని ప్రజలు మండి పడుతున్నారు.
 డెంగీని బూచిగా చూపి రక్తాన్ని పీల్చేస్తున్నారు
►జ్వరాల బారిన పడిన రోగులు ఆసుపత్రికి రాగానే కొందరు వైద్యులు ధనార్జనే ధ్యేయంగా డెంగీ సోకిందని, ప్లేట్‌లెట్స్ బాగా పడిపోయాయని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు సమాచారం.
►ఎలిసా పరీక్ష నిర్వహించకుండానే డెంగీగా నిర్ధారిస్తూ వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
 
తొమ్మిది డెంగీ అనుమానిత కేసులు నమోదు ...

జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది  డెంగీ అనుమానిత కేసులు నమోదయ్యాయి. నిర్ధారణ కోసం రక్త నమూనాలు ల్యాబ్‌లకు పంపించాం. రేపల్లెలో నమోదైన కేసు డెంగీ కాదు. అక్కడ పనిచేస్తున్న ల్యాబ్ నిర్వాహకులు తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల డెంగీ గా భావించారు. జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
 - డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు