ఆరోగ్యశ్రీ రుసుములు పెంపు

28 Jun, 2013 06:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ చికిత్సల రుసుములు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకూ వివిధ వినతులు, డిమాండ్లను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఇకపై ఇంజనీరింగ్ విభాగం తరహాలోనే చికిత్సలకు, థెరపీలకు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు (మెడికల్ ఇన్‌పుట్స్ రేట్స్) తయారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ రుసుముల పెంపులోనే ఉద్యోగుల చికిత్సలకు సంబంధించిన వివరాలు కూడా పొందుపరిచినట్లు అధికారులు జీవోలో పేర్కొన్నారు. కొన్ని చికిత్సల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని, మరికొన్ని చాలా ఎక్కువ ఉన్నాయని, వీటిని నిపుణులతో చర్చించి, సుమారు 30 సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు సేకరించిన తర్వాతే నిర్ణీత రేట్ల పరిధిలోకి తెచ్చామని అన్నారు.

పెంచిన రుసుముల వివరాలను త్వరలోనే ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో ఉంచుతామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గతంలో ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ (ఆశ), ఏపీ నర్సింగ్ అసోసియేషన్ (అప్నా) సంఘాలు చికిత్సల రుసుములు 30 శాతం పెంచాలని, ఏటా 10 శాతం రేట్లు పెంచాలని డిమాండ్ చేసిన విషయం విదితమే. కాగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే శస్త్రచికిత్సలు, థెరపీల రేట్లలో మార్పులు చేర్పులకు సంబంధించిన పూర్తిస్థాయి అధికారాలు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు అప్పజెప్పారు. ఇందులో భాగంగానే ఇన్‌పుట్ కోడ్ బుక్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్‌ను రూపొందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి తెచ్చారు.

అక్రెడిటేషన్ ఉంటేనే నెట్‌వర్క్ పరిధిలో: ఇకపై ఆరోగ్యశ్రీ ప్యానెల్‌లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు అక్రెడిటేషన్ ఉంటేనే అర్హులని తేల్చింది. 2015 జూలై 1 నాటికి ఆరోగ్యశ్రీ చికిత్సలు అందిస్తున్న అన్ని ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్‌ఏబీహెచ్) సర్టిఫికెట్ పొందాలని సూచించారు. ఎన్‌ఏబీహెచ్ సర్టిఫికెట్ పొందితేనే నెట్‌వర్క్ ఆస్పత్రుల పరిధిలో ఉంటాయని, వాటికే పెంపు వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌ఏబీహెచ్ సర్టిఫికెట్ ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు 22 మాత్రమే ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ కోసం ఒకవేళ దరఖాస్తు చేసుకున్నా, అది వచ్చేందుకు రెండు మూడేళ్లు పడుతుంది. ప్రస్తుతం 130 ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఎన్‌ఏబీహెచ్ గనుక తప్పనిసరైతే ఇందులో వంద ఆస్పత్రులు పైనే నెట్‌వర్క్ పరిధి నుంచి వైదొలగాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు