చట్టం.. వారి ఇష్టం!

29 Aug, 2018 13:18 IST|Sakshi
డీఈఓ కార్యాలయం

ఉన్న చట్టాలనే సరిగా అమలు చేయడంలేదు.. మళ్లీ కొత్త చట్టాలతో బోలెడు నిబంధనలు.. ముందస్తు చర్చలు శూన్యం.. వారి నిర్ణయమే శిరోధార్యం.. టీచర్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఉపాధ్యాయ పాలన), టీచర్స్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ (ఉపాధ్యాయ బదిలీలు) ప్రత్యేక చట్టాలకు సంబంధించి ఇటీవల ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిపై ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. కొత్త చట్టాలను తీసుకొస్తూ తమ జీవితాలతో ఆడుకుంటోందని, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ఉపాధ్యాయులు, సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కడప ఎడ్యుకేషన్‌/బద్వేలు: ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్న చట్టాలను ప్రభుత్వం అమలు చేయకపోగా కొత్తవి తేవడంపై ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొంతన లేని నిర్ణయాలతోపాటు కొత్తకొత్త చట్టాలను తీసుకొస్తూ తమ జీవితాలతో ఆటలాడుకుంటుందని వాపోతున్నారు. టీచర్‌ అడ్మిషన్‌(ఉపాధ్యాయ పాలన), టీచర్స్‌ ట్రాన్సఫర్‌ యాక్ట్‌ (ఉపాధ్యాయ బదిలీలు) ప్రత్యేక చట్టాలకు సంబంధించి ఇటీవల ముసాయిదా బిల్లులను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచి ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు.

ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశంలో బిల్లును ఆమోదించి, చట్టం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలతో మాటమాత్రమూ చర్చింకుండానే విద్యాశాఖ ఏకపక్షంగా బదిలీల ముసాయిదా చట్టాన్ని రూపొందించడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత విషయంలో కోర్టులు సైతం జోక్యం చేసుకోవడానికి వీలులేకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని ఆరోపిస్తుస్తున్నారు. గుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలతో జిల్లాలో పలు యాజమాన్యాలలో పనిచేస్తున్న దాదాపు 12 వేలమంది ఉపాధ్యాయులపై ప్రభావం చూపనుంది.

సౌకర్యాలు శూన్యం
జిల్లాలోని పలు పాఠశాలలకు సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోక పోగా ఉపాధ్యాయులకు కొత్తకొత్త చట్టాలెందుకని పలువురు విద్యావేత్తలు, మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించి తర్వాత ఉపాధ్యాయుల అడ్మినిస్ట్రేషన్‌ , బదిలీల చట్టాల గురించి ఆలోచించాలని వారు హితువు పలుకుతున్నారు. సర్వీస్‌ ఆధారంగా ఉపాధ్యాయులకు సంబంధించి పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోక పోవడం దారుణం అన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులకు సంబంధించిన హక్కులను అమలు చేసి తర్వాత నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పలువురు మేధావులు తెలియజేస్తున్నారు.

బదిలీ విధానం ఇలా..
గత ఏడాది ఆగస్టు 2017 జరిగిన బదిలీల్లో ఉపాధ్యాయుల సర్వీస్‌పాయింట్లతోపాటు ప్రతిభ ఆధారిత పాయింట్లద్వారా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. పనితీరు సూచికలు తొలగించాలని కోరుతూ ఉపాధ్యాయులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. బదిలీలపైన ఇంత గందరగోళం జరిగినా, ఉపాధ్యాయులు, సంఘాలురోడ్డు ఎక్కి ఆందోళన చేసినా ప్రభుత్వం అవన్నీ మరచిపోయి తిరిగి శాశ్వత బదిలీల చట్టం పేరుతో తీసుకొచ్చిన ముసాయిదాలో మళ్లీ అవే పాయింట్లు 70 శాతం మేర తీసుకోవడం వివాదాస్పదం అవుతుంది.

ఉపాధ్యాయుల బయోమెట్రిక్‌హాజరుకు 10 పాయింట్లు, సంగ్రహణాత్మక పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యానికి 15 పాయింట్లు ఫ్రొఫిసిడల్‌ డెవలఫమెంట్‌ 15 పాయింట్లు, జాతీయ, రాష్ట్ర అవార్డులు పొందిన వారికి 5 పాయింట్లు, రీసోర్సు పర్సన్లుగా పనిచేసిన వారికి 5 పాయింట్లు, డిజిటల్‌ విద్యాబోధనలో పాల్గొన్నందుకు 15 పాయింట్లు, సైన్సు, లెక్కల ప్రదర్శన శాలలకు 5 పాయింట్లు స్టూడెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు 5 పాయింట్లు, మధ్యాహ్నం భోజన వివరాలను ఆన్‌లైన్‌లో పంపినందకు 5 పాయింట్లు, పాఠశాల యాజమాన్య సమావేశాలు నిర్వహించినందుకు 5 పాయింట్లు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నందుకు 4 పాయింట్లు, విద్యార్థులను డ్రాపౌట్స్‌గా మారకుండా చూసినందుకు 8 పాయింట్లు ఇలా వందపాయింట్లను ప్రామాణికంగా తీసుకుని బదిలీలు చేపట్టనున్నారు. 

నియంతలా వ్యవహిరిస్తున్నప్రభుత్వం 
ప్రస్తుత ప్రభుత్వ పాలన ఉపాధ్యాయుల మనోభావాలకు విరుద్ధంగా ఉంది. ఉపాధ్యాయ సంఘాల వాదనను పెడచెవిన పెడుతూ నియంతలా వ్యవహరిస్తోంది. ఎటువంటి శాస్త్రీయత లేని అసంబద్ధమైన విషయాలను ప్రమాణికంగా తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు ముడిపెట్టడం సరైయిందికాదు. చాలా పాఠశాలల్లో సర్వర్లు పనిచేయక బయోమెట్రిక్‌ హాజరులో ఇబ్బంది ఎదుర్కొంటుంటే పాయింట్లు పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదు. – శ్యాంసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్‌ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఆందోళన చేస్తాం 
గత బదిలీల్లో ప్రతిభ ఆధారిత పనితీరు సూచికలు తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం తిరిగి అవే నిబంధనలనే బదిలీల చట్టంలో పొందుపరచడం అంటే ఉపాధ్యాయులను భయాంధోళనకు గురి చేయడమే. చట్ట నిబంధనలను సవరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం. – రమణారెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్‌ 
జిల్లా అధ్యక్షుడు 

పాఠశాలకు సౌకర్యాలు కల్పించాలి 
పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి. నేటికి చాలా పాఠశాలల్లో సరైన మరుగుదొడ్లు, మంచీనీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నిర్వహణ పేరుతో ఇచ్చే గ్రాంటు కరెంటు బిల్లులకు సరిపోవడం లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఉపాధ్యాయుల గురించి ఆలోచిస్తుంది. ఇదెక్కడి న్యాయం – బాలగంగిరెడ్డి, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు 

ఉపాధ్యాయులకు ప్రత్యేకమా...?
కొంత కాలంగా పాయింట్ల విధానాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017 బదిలీలలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై నిరసన వ్యక్తం చేశారు. మరోసారి తెరపైకి పాయింట్ల విధానాన్ని తీసుకురావటం సరికాదు. ఏశాఖకు లేని పాయింట్ల విధాననం మాకే ఎందుకు పెట్టాలనుకుంటున్నారు. దీనిపై మా సంఘం రాష్ట్ర నాయకులకు వ్యతిరేకత తెలియజేస్తాం.
– సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

విభేదాలు వచ్చే అవకాశముంది
చాలా సార్లు యాప్‌లు సరిగా పని చేయక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి సంబంధించిన అంశాలు అన్‌లైన్‌లో నమోదు కావు. హెచ్‌ఎంలకు పాయింట్లు వచ్చే అవకాశముంది. దీంతో పాయింట్లు రాని ఉపాధ్యాయులకు హెచ్‌ఎంలతో విభేదాలు ఏర్పడే అవకాశముంది. పాయింట్ల విధానంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పాయింట్లు కేటాయిస్తే బాగుంటుంది.    – రామక్రిష్ణారెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు 

మరిన్ని వార్తలు