చెన్నంపల్లి కోటలో ‘సర్కార్‌’ దొంగలు

20 Dec, 2017 01:14 IST|Sakshi
చెన్నంపల్లి కోట, కోటలో మంగళవారం సాయంత్రం తవ్వకాలు

     కోటలో గుప్తనిధుల వేట.. కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం

     ప్రైవేటు ఏజెన్సీకి సీఎంఓ నుంచి గ్రీన్‌సిగ్నల్‌

     లిఖితపూర్వక అనుమతులు లేకుండానే తవ్వకాలు 

     పురావస్తు శాఖకు సమాచారం లేదు

     మౌఖిక ఆదేశాల మేరకేనని ఒప్పుకున్న కలెక్టర్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: గుప్త నిధుల కోసం ఓ చారిత్రక కట్టడంలో అక్రమ తవ్వకాలు జరుగుతుండడం సంచ లనంగా మారింది. పురాతన కట్టడాల వద్ద తవ్వకాలు జరిపేటపుడు పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వాలన్న సంగతినీ పక్కన పెట్టేశారు. నిధులున్నాయి.. తవ్వుకుంటాం అని ఓ ప్రైవేటు ఏజెన్సీ అడగ్గానే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అనుమతించే సిందట. లిఖితపూర్వకమైన ఆదేశాలేవీ లేవు. కేవలం మౌఖిక ఆదేశాలే. దీనిపై ఆర్డీవో ఒకమాట చెబుతుండగా కలెక్టర్‌ మరోమాట చెబుతున్నారు. ఈ అక్రమ తవ్వకాల వెనక అధికారపార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందని వినిపిస్తోంది. గ్రామస్తులు గొడవచేయడంతో తూతూమంత్రంగా గ్రామ సభ నిర్వహించి మమ అనిపించారు. అయితే తవ్వకాలు మాత్రం ఆపలేదు. గ్రామస్తుల హడావుడి ఉంటే తాత్కాలికంగా విరామమిస్తూ మరలా కొనసాగిస్తున్నారు.. రాత్రిపూట కూడా తవ్వ కాలు సాగిస్తున్నారు. అధికారుల అండదండలతో.. పోలీసుల పహారా మధ్య తవ్వకాలు అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఇంతకీ ఈ కోట ఎక్కడుందా అనుకుంటు న్నారా.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లోని చెన్నంపల్లి కోట ఇది. ఈ నెల 13 నుంచి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి.

గతంలోనూ విఫలయత్నాలు..
చెన్నంపల్లి కోటలో భారీగా నిధి నిక్షేపాలున్నాయన్న ప్రచారం ఇప్పటిది కాదు. గతంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. పదేళ్లుగా కొందరు స్థానికుల సాయంతో తవ్వ కాలకు ప్రయత్నిస్తూనే వచ్చారు. 2006లో ఓసారి రాత్రిపూట తవ్వకాలు జరుపుతుం డగా.. గ్రామస్తులు అప్పటి జిల్లా కలెక్టర్, ఎస్పీకి తెలియజేశారు. దాంతో నిధి ఉందని ప్రచారం జరుగుతున్న ప్రాంతం వద్ద తవ్వ కాలు జరిపేందుకు వీలులేకుండా స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల చేత పెద్ద బండరాయి వేయించారు. ఆ తరువాత కూడా పలుమార్లు రాత్రి సమయాల్లో తవ్వకాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.   2014,15లోనూ ఇదేవిధంగా తవ్వకాలు జరిపారు. ఎవరి ప్రయత్నాలూ ఫలించలేదు.

ప్రైవేటు ఏజెన్సీకి సీఎంఓ అనుమతి
ప్రస్తుతం తవ్వకాలు చేపడతామని సీఎంఓకు ఒక ప్రైవేటు ఏజెన్సీ దరఖాస్తు చేసుకోగా అనుమతిస్తూ జిల్లా యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చేశాయి.. అయితే మౌఖిక ఆదేశాలతోనే అధికారులు తవ్వకాలు ప్రారం భించారు. ఈ విషయాన్ని స్వయంగా కలెక్టరే ఒప్పుకోవడం గమనార్హం. మరోవైపు తవ్వ కాలు చేపట్టే ముందు అధికారులు కనీసం గ్రామసభ కూడా నిర్వహించలేదు. మొదటి రోజు (ఈ నెల 13) ఏకపక్షంగా తవ్వకాలకు పూనుకున్నారు. దీనిపై గ్రామస్తులు అభ్యంత రాలు తెలిపి తవ్వకాలను అడ్డుకోవడంతో రెండోరోజు గ్రామసభ పెట్టారు. ఇందులోనూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయ త్నం చేయలేదు. అనుమతులు చూపాలంటూ అధికారులను గ్రామస్తులు, వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులు నిలదీసినా ఖాతరు చేయ కుండా.. ‘కమిటీ పర్యవేక్షణ’ పేరిట పనులు కొనసాగించారు.  ఇక కోట కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖల పరిధిలో లేనప్పటికీ ఇటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేటప్పుడు రెవెన్యూ, మైనింగ్‌తో పాటు పురావస్తు శాఖ సిబ్బంది కూడా అక్కడ ఉండాలి. అయితే.. ఈ కోట విషయంలో మైనింగ్, రెవెన్యూ అధికారులే ఉంటున్నారు. పురావస్తు శాఖకు సమాచారాన్ని కూడా జిల్లా యంత్రాం గం ఇవ్వకుండా  తవ్వకాలు ప్రారంభించారు. ఇక తవ్వకాలు చేపట్టరాదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో కొద్దిమందిని కమిటీలో నియమించారు. 

మౌఖిక ఆదేశాల మేరకేనన్న కలెక్టర్‌
చెన్నంపల్లి కోటలో అధికారులు చేపడుతున్న తవ్వకాల వ్యవహారం మొదటినుంచి అను మానాలను రేకెత్తిస్తోంది. తవ్వకాలు చేపట్టే సమయంలో గ్రామస్తులు నిలదీసినప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెన్నంపల్లి కోటను సందర్శించి.. అధికారులను నిలదీయగా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ చెప్పిన ఆర్డీఓ.. ఆ పత్రాలు చూపమంటే మాత్రం పట్టించు కోలేదు. ఇదే విషయమై కలెక్టర్‌ సత్యనారాయణను వైఎస్సార్‌ సీపీ బృందం సోమవారం కలసి ప్రశ్నించగా.. మౌఖిక ఆదేశాలతోనే తవ్వకాలు చేపడుతున్నామని వెల్లడించారు. అక్కడ పురావస్తు శాఖ సిబ్బంది లేరని అంగీకరించారు. తవ్వకాల విషయాన్ని పురా వస్తు శాఖ దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ బృందానికి హామీ ఇచ్చారు. ఈ విధంగా లిఖిత పూర్వక ఆదేశాలు ఉన్నాయని ఒకసారి, లేవని మరోసారి అధికారులు పేర్కొనడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో సదరు ప్రైవేటు సంస్థ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలకు రాత్రి సమ యాల్లో కూడా తవ్వకాలు చేపడుతుండటం బలం చేకూరుస్తోంది. 

ఆగని తవ్వకాలు: చెన్నంపల్లి కోటలో అధికారులు చేపట్టిన గుప్త నిధుల తవ్వకాలు ఆగేలా లేవు.  సోమవారం  తవ్వకాల్ని ఆపేసిన అధికారులు.. మంగళవా రం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి  ప్రారం భించారు. తవ్వకాలు జరుపుతున్న చోట  సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆరు రోజు లుగా భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య నియో జకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్‌ అండ్‌ జియాలజీ ఏడీ నటరాజ్‌ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగాయి. మొదట్లో ఎవరికీ చెప్ప కుండా, హడావుడిగా తవ్వకాలు జరిపారు. అనుమతులపై గ్రామ స్తులు నిల దీయడంతో మరుసటి రోజు (ఈ నెల 14న) కమిటీ వేయడంతో పాటు  గతంలో తవ్వ కాలు జరిపిన వ్యక్తుల సహకారం తీసుకుంటున్నారు. తవ్వకాల్లో ఎముకలు, మెత్తటి నల్లమట్టి బయటపడ్డాయి. నీటిఊట కూడా వచ్చింది.  మంగళవారం సాయంత్రం ఆర్డీఓ కోటపైకి వచ్చిన తర్వాత తవ్వకాలు తిరిగి ప్రారంభించారు. 

ఇదీ చెన్నంపల్లి కోట చరిత్ర..
గోల్కొండ సుల్తాన్, పోర్చు గీసు వారు ఏకమై దాడులు చేస్తున్న నేపథ్యంలో 1584–1614 మధ్య విజయనగర రాజులు గుత్తి కోటను వదిలి.. అక్కడున్న సంప ద, ఆయుధాలను ఓ రహస్య కోటకు తరలించినట్లు చరిత్ర చెబుతోంది. గుత్తి కోటకు సమీపం లో ఉన్న స్వర్ణగిరి (ఇప్పటి జొన్నగిరి) మీదుగా చెన్నంప ల్లి కోటకు చేరుకునే విధంగా సొరంగ మార్గాన్ని తవ్వించారు. చెన్నంప ల్లిలో వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్ద కోటను ఏర్పాటుచేశారు. విజయనగర రాజులు ఆదోని, రాయచూరు, గుత్తి, బళ్లారి తదితర కోటల్లో వజ్ర వైఢూర్యాలు, అపార సంపదను భద్రపరిచారని, ఇలా భద్రపరచిన వాటిలో చెన్నంపల్లి కోట కూడా ఒకటని అంటున్నారు. ఈ కోటలో విజయనగర పాలనకు సంబంధించిన శిలా శాసనాలు, దేవతా విగ్రహాలు కనిపించడం అందుకు ఊతమిస్తోంది.

మరిన్ని వార్తలు