ఫలించిన పోరాటం!

28 Sep, 2019 10:34 IST|Sakshi
సింగరాయకొండ మండలం జిల్లెళ్లమూడి వద్ద పీబీ ఛానల్‌లో పేరుకు పోయిన ఇసుక మేట

పీబీ ఛానల్‌ ఆనకట్టలో ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధం

ఆనకట్టలో ఇసుక మేట వేసిన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ పోల భాస్కర్‌

ఇసుక మేటతో రెండు దశాబ్దాలుగా 0.13 టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సమస్యకు పరిష్కారం

రెండు దశాబ్దాల క్రితం పచ్చని పంటలతో కళకళలాడిన సాగు భూములు కొందరి స్వార్ధ రాజకీయాల కారణంగా బీడుగా మారిపోయాయి. సాగు నీరు అందక, పంటలు ఎండిపోవటంతో వేలాది మంది రైతులు తీవ్ర నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇతర జిల్లాలకు నాణ్యమైన ధాన్యం ఎగుమతి చేసిన వారు తిండి గింజల కొనుక్కోవాల్సిన దుర్భర స్థితికి దిగజారారు. ఇది పాలేరు–బిట్రగుంట సప్లై ఛానల్‌ (పీబీ ఛానల్‌) కింద సాగు చేసుకుంటున్న రెండు మండలాల రైతుల దీనగాథ. గత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధుల నిర్లక్ష ధోరణి వల్ల ఏర్పడిన ఈ సమస్యకు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు నెలలకే పరిష్కారం లభించింది. రైతుల మోముల్లో ఇప్పుడు ఆనందం తొణికసలాడుతోంది. దశాబ్దాలుగా తాము చేస్తున్న పోరాటం ఫలించి ఛానల్‌ ద్వారా తమ పొలాలకు సాగు నీరు అందుతుందనే సంతోషం నెలకొంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని కందుకూరు మండలం జిల్లెళ్ళమూడి– జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామాల మద్య పాలేరుపై 1960లో పాలేరు–బిట్రగుంట సప్లై ఛానల్‌ నిర్మించారు. 0.73 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో జిల్లెళ్ళమూడి గ్రామం వద్ద పీబీ ఛానల్‌కు చెందిన ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నుంచి ఛానల్‌ను నిర్మించి ఆ ఛానల్‌ ద్వారా సింగరాయకొండ మండలంలోని పాకల, కలికవాయ, బింగినపల్లి, సోమరాజుపల్లె, పాత సింగరాయకొండ, మూలగుంటపాడు, సింగరాయకొండ గ్రామాలతో పాటు జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట గ్రామాలకు సాగు నీటిని అందించే విధంగా నిర్మాణం చేపట్టారు. అందుకుగాను సింగరాయకొండ మండలంలో 7 చెరువులు, జరుగుమల్లి గ్రామంలో ఒక చెరువు నిర్మించి వాటిని నింపటం ద్వారా ఈ 9 గ్రామాలకు సాగు నీరు ఇచ్చేలా రూపకల్పన చేశారు. 1996 వరకు ఈ ప్రాంతం పచ్చన మాగాణి పొలాలతో పాటు ఆరుతడి పంటలకు కూడా ఈ ఛానల్‌ ఎంతగానో ఉపయోగపడుతూ వచ్చింది.

అయితే ఆ తరువాత వచ్చిన భారీ వరదల వల్ల ఛానల్‌కు సంబంధించిన ఆనకట్టకు సమానంగా ఇసుక మేట వేయటంతో నీటి నిల్వ సామర్ధ్యం పూర్తిగా తగ్గిపోయి చెరువులకు నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఛానల్‌ కింద సుమారు 10 వేల ఎకరాల సాగు భూమి నేడు బీడు భూములుగా మారిపోయాయి. 1996 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. గతంలో కలెక్టర్‌ సుజాత శర్మ ఇసుక తవ్వకాల కోసం  ప్రయత్నించటంతో ఆనకట్టలో బోర్లు వేసిన కొందరు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. ఆ తరువాత కోర్టు స్టే తొలగించినప్పటికీ అధికారులు ఇసుక తవ్వకుండా వదిలేశారు. దీంతో గతంలో నాణ్యమైన సన్నబియ్యంతో పాటు బాసుమతిలాంటి ఖరీదైన బియ్యాన్ని ఎగుమతి చేసిన అక్కడి రైతులు ప్రస్తుతం తిండి గింజలు, పశువుల మేత కొనుక్కోవాల్సిన దుర్భర స్థితిలోకి వెళ్లారు.

కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు..
ఇసుక మేటలను తొలగించమంటూ రైతు సంఘాల నాయకులతో కలిసి ఏళ్లతరబడి అనేక పోరాటాలు చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం వీరి గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా మంచి రోజులు రాకపోతాయా అంటూ అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడవకముందే ఆనకట్టలో వేసిన ఇసుక మేటలను తవ్వి జిల్లాలో ఇసుక కొరతను తీర్చటంతో పాటు రైతుల ఇబ్బందులను సైతం తొలగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆనకట్టలోని ఇసుక మేటలను తవ్వి జిల్లాలో ఇసుక కొరతను తీర్చేందుకు సమాయత్తం అయ్యారు.

అందులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్, జాయింట్‌ కలెక్టర్‌ షాన్మోహన్‌లు ఇసుక మేట వేసిన ప్రాంతాలను పరిశీలించి ఇసుక తవ్వకాలకు ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ తవ్విన ఇసుకను జిల్లాలోని కందుకూరు, కనిగిరి, ఒంగోలులలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులకు తరలించి అక్కడ నుంచి ప్రజలకు ఇసుకను సరఫరా చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో ప్రజలు పడుతున్న ఇసుక కష్టాలు తీరడంతో పాటు దశాబ్దాలుగా పిబి ఛానల్‌ పరిధిలో వేలాది మంది రైతులు పడుతున్న ఇబ్బందులు తొలగి, వారి లోగిళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు