గౌరిగోపాల్‌లో వంద ఓపెన్ హార్ట్ సర్జరీలు

2 Mar, 2016 03:55 IST|Sakshi
గౌరిగోపాల్‌లో వంద ఓపెన్ హార్ట్ సర్జరీలు

కర్నూలు(జిల్లా పరిషత్): నగరంలోని గౌరి గోపాల్ హాస్పిటల్‌లో వంద ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి చైర్మన్ టి.జి.భరత్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ పీఎన్‌ఎన్ లక్ష్మణస్వామితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్డియాలజీ విభాగం ప్రారంభించిన 8 నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో 60 బైపాస్ సర్జరీలు, 31 వాల్వ్/గుండె కవాటానికి సంబంధించిన ఆపరేషన్లు, 8 పుట్టుకతో గుండెజబ్బు వచ్చిన వారికి ఆపరేషన్లు, ఒకరికి గుండెలో కణితి(మిక్సోమా)కి సంబంధించిన ఆపరేషన్లు ఉన్నాయన్నారు.

ఇవి కాకుండా ప్రమాదాల్లో రక్తనాళాలు తెగిపోయిన 8 మందికి చికిత్స చేశామన్నారు. రక్తనాళాలు బ్లాక్ అయి కాలు, చేతిలో రక్తప్రసరణ లేక నొప్పి ఉన్న వారికి మరో ఆరుగురికి విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. కిడ్నీ ఫెయిల్ అయిన వారికి ఏవీ ఫిస్టులా ఆపరేషన్‌లు 150 జరిగాయన్నారు. అదేవిధంగా టీబీ జబ్బు వల్ల ఊపిరితిత్తులు పాడైన 5గురికి, ఊపిరితిత్తుల్లో హైడాటెడ్ లాగ్ ఉన్న ఇద్దరికి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. సిరలలో జబ్బు(డీవీటీ/వెరికోస్ వీన్స్) ఉన్న 50 మందికి వైద్యం చేశామన్నారు. ఇక కేథలాబ్‌లో 780 మందికి యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించామని, అందులో 300 మందికి స్టెంట్స్ వేశామని వివరించారు.

14 మందికి కంప్లీట్ హార్ట్ బ్లాక్ ఉన్న వారికి పేస్‌మేకర్ వేశామన్నారు. టీబీతో గుండెచుట్టూ చెడు నీరు చేరిన వారికి పిగ్‌టైల్ క్యాథటర్ ద్వారా వైద్యం చేశామన్నారు. ఆసుపత్రిలో ఎన్‌టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ), ఉద్యోగశ్రీ రోగులకు లాభాపేక్ష లేకుండా ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ ఆంథోనిరెడ్డి మాట్లాడుతూ 1991లో ఆసుపత్రి ఏర్పాటైందని.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్, బెంగళూరు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు దీటుగా అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశామన్నారు.

అత్యాధునిక టెక్నాలజితో కూడిన క్యాథల్యాబ్‌లో 300 స్టెంట్స్, 770 యాంజియోగ్రామ్‌లు, 14 పర్మినెంట్ పేస్‌మేకర్లు అమర్చినట్లు చెప్పారు. గుండెపోటు వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వెంటనే ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ మాలకొండయ్య, అనెస్తెటిస్ట్ డాక్టర్ అజయ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మహ్మద్ అలి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు