కొనుగోల్ మాల్!

19 Jan, 2015 03:24 IST|Sakshi
కొనుగోల్ మాల్!

 పాలకొండ:జిల్లాలో ధాన్యం పండించిన రైతులకు ఎదురవుతున్న సమస్యల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఇటు మిల్లర్లు.. అటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల తిరస్కరణతో కష్టనష్టాలకోర్చి పండించిన ధాన్యం రాసులను కళ్లాల్లోనే పెట్టుకొని దిక్కులు చూడాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం రైతులకు శాపంగా మారింది. లెవీ తగ్గించడంతో రైతులు ధాన్యం అమ్ముకొనేందకు ఆపసోపాలు పడుతున్నారు. మార్కెట్‌లో పూర్తిగా డిమాండ్ లేకపోవడంతో ధాన్యానికి మద్దతు ధర లేక రైతుకు పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. సంక్రాంతి ముందునాటికే ధాన్యం అమ్మకాలు పూర్తి కావాల్సి ఉండగా పండుగా వెళ్లిపోయిన తర్వాత కూడా కళ్లాల్లో ధాన్యం కుప్పలు వెక్కిరిస్తున్నాయి.  
 
 లెవీ తగ్గింపుతో..
 ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ధాన్యం అమ్ముకోలేక  అవస్థలు పడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వ మద్దతు ధర కంటే బయట మార్కెట్‌లో ఎక్కువ ధర పలికింది. దీనికి కారణం ఉత్పత్తిలో 75 శాతం వరకు లెవీగా సేకరించాలన్న లక్ష్యం ఉండటంతో దాన్ని చేరుకొనేందుకు మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసి కేంద్రాలకు విక్రయించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం లెవీని 25 శాతానికి కుదించడంతో మిల్లర్లకు ధాన్యంతో సంబంధం లేని పరిస్థితి నెలకొంది. దీంతో పలుకుబడి ఉండి నాణ్యమైన ధాన్యం పండించిన రైతుల వద్దే కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు గత ఏడాది బయట జిల్లాల నుంచి వర్తకులు రావడంతో మిల్లర్లు లెవీ లక్ష్యాల కోసం ధర పెంచి రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ ఏడాది బయట వర్తకులను రాకుండా అడ్డుకోవడంతో క్వింటాకు రూ.900 ధర లభించడమే గగనంగా మారింది. దీనిపై ఓ మిల్లరు మాట్లాడుతూ గోనె సంచులు, కొనుగోలు కేంద్రాల  సిబ్బందికి కమీషన్ల కోసమే ప్రభుత్వం క్వింటాకు రూ.170 వరకు ఖర్చు చేస్తోంది. అందులో కనీసం వంద రూపాయలు మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చేవారన్నారు. ప్రభుత్వం నిర్ణయం డబ్బులు వృథా కావడానికి తప్ప కొనుగోళ్లకు దోహదపడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
 
 రంగుమారిన ధాన్యం పరిస్థితి ఏమిటి...
 తుపాను కారణంగా రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం పదే పదే ప్రకటించినా అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. కొనుగోలు కేంద్రాలకు దీనిపై ఎటువంటి ఆదేశాలు అందలేదు. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు రంగుమారిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించి నెల రోజులు కావస్తున్నా నేటికీ అమలు కాలేదు. కేంద్రాల్లో వీటికి ధర నిర్ణయించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేయగా, హుద్‌హుద్ తుపాను కారణంగా సుమారు లక్ష హెక్టార్లలో పండిన ధాన్యం రంగుమారింది. ఈ ధాన్యాన్ని కొనేవారు లేకపోవడంతో రైతులు నూర్పులు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు.
 
 కొనుగోలు కేంద్రాలు వెలవెల
 జిల్లాలో మొత్తం 115 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. వీటిలో ఐకేపీ పరిధిలో 83, పీఏసీఎస్‌ల పరిధిలో 51, డీసీఎంఎస్ ద్వారా 5, జీసీసీ ద్వారా 6 కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా 3 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే రెండు నెలలు కావస్తున్నా జిల్లా వ్యాప్తంగా 64,349 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈ నెల పదో తేదీ నాటికి 7,345 మంది రైతుల నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతి కారణంగా నాలుగైదు రోజులు కేంద్రాలకు సెలవు ప్రకటించడంతో కొనుగోళ్లు జరగలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే రైతులకు ఒక్కరోజులోనే డబ్బులు చెల్లిస్తామని ప్రకటించినా నెల రోజుల్లోపు అందించే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికే రైతులకు రూ.15 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బు కోసం రైతులు కొనుగోలు కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
 
 రవాణా చార్జీల కుంభకోణం
 రైతులకు చె ల్లించాల్సిన రవాణా చార్జీల్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే క్వింటాకు రూ.32 చొప్పున రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి ఏటా సీజన్ ముగిశాక ఈ సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఆ క్రమంలో గత ఏడాది రవాణా చార్జీలను ప్రస్తుతం రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది రవాణా చార్జీల్లో అధికార పార్టీ నాయకులు చేతివాటం చూపారు. జిల్లాకు చెందిన ఓ నాయకుని అనుచరులకు ఈ నిధులు మళ్లించేలా పథకం వేశారు. రవాణా చార్జీలను రైతులకు నేరుగా చెల్లించకుండా ఆ బాధ్యతను డివిజన్‌కు ఒకరు చొప్పున ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు.
 
 వీరు రైతు కళ్లాల నుంచి ధాన్యాన్ని ఉచితంగా మిల్లుకు తరలించాలి. అందుకు ప్రతిఫలంగా రవాణా చార్జీలను వీరి ఖాతాకు మళ్లిస్తారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లు వరకు వీరు ధాన్యాన్ని తరలిస్తారని చెబుతున్నారు. వాస్తవానికి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు. శ్యాంపిల్‌ను మాత్రమే తీసుకెళతారు. దాన్ని కొనుగోలు కేంద్రం సిబ్బంది పరిశీలించి కొనుగోలు అంగీకరించిన తర్వాత కళ్లాల్లో తూకం వేయించి నేరుగా మిల్లుకు అప్పజెబుతారు. కానీ ధాన్యాన్ని కాంట్రాక్టర్లే తరలిస్తున్నట్లు కేంద్రాల్లో నమోదు చేసుకుంటున్నారు. ఈ విధంగా సుమారు కోటి రూపాయల వరకు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు అవకాశం కల్పించారు. అధికారులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి హస్తం ఉండడంతో  ఏమీ చేయలేక రైతులే పోరాడాలని సూచిస్తున్నారని జిల్లా ఏరువాక సభ్యుడు ఖండాపు ప్రసాదరావు చెప్పారు.
 
 మిల్లరు తిరస్కారం
 అంపిలి గ్రామానికి చెందిన ఇనుముల అప్పారావు ఇటీవల పంట నూర్పులు పూర్తి చేసి ధాన్యం అమ్మేందుకు శ్యాంపిల్‌తో మిల్లరు వద్దకు వెళ్లాడు.
 ‘ఈ ధాన్యాన్ని మేము కొనలేం, తేవాల్సిన అవసరం లేద ని’ మిల్లరు స్పష్టం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతు చెప్పగా జిల్లా కలెక్టర్‌తో సహా ఎవరికి చెప్పుకోమంటావో చెప్పుకో అంటూ సమాధానమిచ్చారు.
 
 కొనుగోలు కేంద్రం నిస్సహాయత
 మరో రైతు కాయల సత్యనారాయణ ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లాడు. మా వద్దకు వస్తే చేసేది ఏమీ లేదు. మిల్లర్‌కు తీసుకెళ్లండి. కొనుగోలుకు వారు ఇష్టపడితే మేం గోనె సంచులు ఇస్తామని అక్కడి సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు