సర్వం సన్నద్ధం...

20 Oct, 2013 02:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : 2013-14 ఖరీప్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 వేల హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు. అయితే  నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి పంటలు వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యమైనా కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒక్కో కేంద్రంలో 20 టార్పాలిన్‌లు, ఆ మేరకు గన్నీ సంచుల కోసం ఇండెంట్ ఇచ్చారు.
 
 ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల   కమీషన్..
 డీఆర్‌డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేసే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకొచ్చారు. మహిళా సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్‌లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్‌లో సైతం 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు.
 
 ఈసారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున.. రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉందని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. కాగా గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,345, కామన్‌కు రూ.1.310 మద్దతు ధరపై నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రేడ్-ఏ, కామన్ రకాల ధాన్యంలో రా రైసుమిల్లుకు విరుగుడు 25 శాతం, బాయిల్డ్‌కైతే 16 మించకుండా చూడాలి. ధాన్యంలో తేమ 14 శాతం దాటితే కొనుగోలు చేయకూడదన్న నిబంధనలు కూడా ఉన్నాయి. కాగా ఈ సారి ప్రభుత్వం పెంచిన మద్దతు ధర కంటి తుడుపుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 ఈనెల 25 నుంచి ధాన్యం కొనుగోళ్లు..
 డీఆర్‌డీఏ ఐకేపీల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసే ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ గోదాములతోపాటు రైసుమిల్లుల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాము. ఈ నెల 25 నుంచి 124 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయి. ఇప్పటికే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సంబంధిత అధికారులు, సిబ్బందితో పలుమార్లు సమీక్షించారు. 21న నిర్మల్, 22న మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాల్లో కొనుగోళ్లను పర్యవేక్షించే, పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సులు కూడా ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలను పాటించి రైతులు కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర పొందాలని కోరుతున్నాము.
 - పి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్‌డీఏ

మరిన్ని వార్తలు