31,53,524 మెట్రిక్‌ టన్నులు

27 Jun, 2020 05:06 IST|Sakshi

గత రబీలో రైతుల నుంచి సర్కారు కొనుగోలు చేసిన ధాన్యం

ఇందుకోసం చెల్లించాల్సిన మొత్తం రూ.5,744 కోట్లు

ఇప్పటికే రూ. 4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ

మిగతా సొమ్ము త్వరలో చెల్లిస్తామన్న అధికారులు  

సాక్షి, అమరావతి: రబీ సీజన్‌(2019–20)లో 2,15,150 మంది రైతుల నుంచి రూ.5,744.96 కోట్ల విలువ చేసే 31,53,524.520 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,437 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కాగా క్వింటాలు ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1,835, సాధారణ ధాన్యానికి 1,815 చొప్పున మద్దతు ధర నిర్ణయించింది. 

► స్వయం సహాయక గ్రూపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. 
► ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాల అమలు కోసం 33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అవసరం ఉందని గుర్తించి ఆ మేరకు సేకరించిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్‌ (సీఎమ్మార్‌) కోసం మిల్లులకు పంపుతారు. ధాన్యం మిల్లులకు చేరిన 15 రోజుల్లోగా మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. 
► బియ్యం కొరత ఉన్న జిల్లాలకు మిగులు ఉన్న జిల్లాల నుంచి బియ్యాన్ని తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. 
► సేకరించిన ధాన్యానికి మొత్తం రూ.5,744.96కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.4,514.66 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.  

>
మరిన్ని వార్తలు