ధాన్యం కొనుగోళ్లు మొదలు

6 Apr, 2020 02:59 IST|Sakshi

తొలి రోజు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం 4,773 మెట్రిక్‌ టన్నులు

అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు పెంచుకునేందుకు అనుమతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాలకు మొదటి రోజు 4773.360 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చింది. గ్రేడ్‌–ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1,835, సాధారణ రకం క్వింటాల్‌కు రూ. 1,815లు ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. ధర విషయంలో దళారుల చేతిలో రైతులు మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు.  

– రబీ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించిన వెంటనే మూడు జిల్లాల్లోని 34 మండలాల రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు.  
– చిత్తూరు జిల్లాలోని కె.వి.పి.పురం, రేణిగుంట, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు 354.920 మె.ట ధాన్యం వచ్చింది. 
– నెల్లూరు జిల్లాలోని అల్లూరు, అనుమసముద్రంపేట, ఆత్మకూరు, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, చిత్తమూరు, డక్కిలి, గూడూరు, జలదంకి, కలిగిరి, కలువాయి, కావలి, కొడవలూరు, కోట, కోవూరు, మనుబోలు, ముత్తుకూరు, నాయుడుపేట, నెల్లూరు, ఓజిలి, పెళ్లకూరు, పొదలకూరు, సంగం, సూళ్లూరుపేట, వాకాడు, వెంకటాచలం, విడవలూరు మండలాల్లోని కేంద్రాలకు 4,317.640 మె.ట ధాన్యం వచ్చింది. 
– పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు, పెదపాడు మండలాల్లోని కేంద్రాలకు 100.800 మె.ట ధాన్యం వచ్చింది. 

75 రోజుల పాటు కేంద్రాలు 
లాక్‌డౌన్‌ నేపథ్యంలోనూ రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని చేస్తున్నాయి. దీంతో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. 75 రోజుల పాటు కేంద్రాలు పని చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రబీ సీజన్‌లో కోతలు ప్రారంభం కావడంతో అవసరాన్ని బట్టి కేంద్రాలు ప్రారంభించనున్నారు. కృష్ణా, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి. అవసరాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా 1,280 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సీజన్‌లో 30 లక్షల మె.ట పైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మరిన్ని వార్తలు