గ్రామదర్శిని..మళ్లీ తెరపైకి

12 Dec, 2013 02:08 IST|Sakshi

చిలుకూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు  గ్రామదర్శనం కార్యక్రమం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో గ్రామదర్శిని పేరుతో జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు గ్రామదర్శనంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమం తిరిగి శుక్రవారం నుంచి జిల్లాలో అమలు కానున్నది. ఈ మేరకు మండల స్థాయి అధికారులకు బుధవారం జిల్లా కలెక్టర్ చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ పథకాన్ని 2012 ఫిబ్రవరిలో జిల్లాలో ప్రవేశపెటినా అశించిన స్థాయిలో అమలు కాలేదు. తిరిగి నూతనంగా వచ్చిన కలెక్టర్ చిరంజీవులు ఈ గ్రామదర్శనం పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మండల పరిషత్ ప్రత్యేక అధికారి సమక్షంలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ గ్రామదర్శనం కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాల్లో పథకాల పనితీరును పర్యవేక్షించడం, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంపొందించడం, మనంకోసం మనం కార్యక్రమం విజయవంతం చేయడం, గ్రామస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరు, రహదారులు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర పనులను పర్యవేక్షించి వాటిని సక్రమంగా అమలు చేయడమే గ్రామదర్శనం ప్రధాన ఉద్దేశ్యం.
 ప్రతి శుక్రవారం అమలు
 ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం అమలు చేస్తారు. కార్యక్రమానికి మండలస్థాయి అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులు అందరూ హజరవుతారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈవో, మండల పశువైద్యాధికారి, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వ్యవసాయాధికారి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్, ఉపాధిహమీ ఏపీఓ, ఐకేపీ ఏపీఎం, సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్, హౌసింగ్, పంచాయితీ రాజ్, విద్యుత్ ఏఈలు తదితరులు పాల్గొంటారు. వీరేకాకుండా గ్రామస్థాయి అధికారులు పాల్గొంటారు. వీరంతా గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించి లోపాలను సవరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులపై జవాబుదారీతనం పెరుగుతుంది.

మరిన్ని వార్తలు